బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన కొత్త కుర్రాడు..!
పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ హసన్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
By Medi Samrat
పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ హసన్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 44 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో బాబర్ ఆజం రికార్డును కూడా హసన్ నవాజ్ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన పాక్ బ్యాట్స్‌మెన్‌గా హసన్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ పేరిట ఉంది.
ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ హసన్ నవాజ్ 45 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 10 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. హసన్ ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లోకి తిరిగి వచ్చింది. సిరీస్‌లోని మొదటి 2 టీ20 మ్యాచ్‌లను న్యూజిలాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌ను గెలిచి పాకిస్తాన్ జట్టు సిరీస్‌లోకి తిరిగి వచ్చింది.
హసన్ కంటే ముందు పాకిస్థాన్ తరఫున అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ బాబర్ అజామ్ పేరిట ఉంది. 2021 ఏప్రిల్ 14న సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో బాబర్ 49 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో అహ్మద్ షాజాద్ మూడో స్థానంలో ఉన్నాడు. 2014లో బంగ్లాదేశ్‌పై అహ్మద్ 58 బంతుల్లో సెంచరీ సాధించాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు ఈస్టోనియా బ్యాట్స్‌మెన్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. 17 జూన్ 2024న ఎపిస్కోపిలో సైప్రస్‌తో జరిగిన T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సాహిల్ 27 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ జట్టు 16 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. T20 ఇంటర్నేషనల్‌లో 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఇప్పటివరకూ మూడుసార్లు 9 లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో గెలిచిన జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.