టీ 20 ప్రపంచకప్ : భారత్‌తో ఆడేందుకు 12 మందితో జట్టును ప్రకటించిన పాక్
Pakistan's 12-man squad for India clash announced.టీ 20 ప్రపంచకప్‌లో నేటి నుంచి అసలు సమరం ఆరంభం కానుంది.
By తోట వంశీ కుమార్
టీ 20 ప్రపంచకప్‌లో నేటి నుంచి అసలు సమరం ఆరంభం కానుంది. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్ రేపు దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులే కాకుండా.. యావత్తు క్రికెట్ ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తోంది. కప్ గెలవకున్నా ఫర్వాలేదు కానీ.. ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటారు అంటే.. ఈ మ్యాచ్‌ను వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు భారత జట్టును పాక్ ఓడించలేదు. అయితే.. అనిశ్చితికి మారుపేరైన టీ20 గేమ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు.
దుబాయ్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తామని.. పాక్ జట్టులోని ఆటగాళ్లతో పాటు మాజీలు ఇప్పటికే పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇంకా మ్యాచ్‌కు ఓ రోజు సమయం ఉండగానే.. పాక్ జట్టు ఓ అడుగు ముందుకు వేసి 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
Pakistan's 12 for their #T20WorldCup opener against India.#WeHaveWeWill pic.twitter.com/vC0czmlGNO
— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2021
పాకిస్థాన్ జట్టు :
బాబర్ ఆజామ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ ఉన్నారు.
ఈ 12 మందిలో షోయబ్ మాలిక్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. గత కొంత కాలంగా సీనియర్ ఆటగాడైన షోయబ్ మాలిక్ ఫామ్‌లో లేడు. దీంతో కెప్టెన్ బాబర్ ఆజామ్ అతడిని ఆడించే సాహసం చేస్తాడా లేదా అనేది రేపు తెలుస్తుంది.