ఇంకెంత ఏడుస్తారో.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్

భారత్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ క్యాచ్ విషయంలో గొడవ మొదలైంది.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 6:00 PM IST

ఇంకెంత ఏడుస్తారో.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్

భారత్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ క్యాచ్ విషయంలో గొడవ మొదలైంది. ఈ విషయంలో టీవీ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని తప్పుబడుతూ పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఫఖర్ జమాన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ పట్టిన క్యాచ్‌ను ఫీల్డ్ అంపైర్ గాజీ సోహెల్ నిర్ణయం కోసం టీవీ అంపైర్‌కు నివేదించారు. రీప్లేలలో బంతి శాంసన్ గ్లోవ్స్‌లోకి వెళ్లే ముందు నేలను తాకినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, శ్రీలంకకు చెందిన టీవీ అంపైర్ రుచిర పల్లియగురుగే దీనిని క్లీన్ క్యాచ్‌గా నిర్ధారించి ఔట్‌గా ప్రకటించారు.

మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను సంప్రదించారు. అయితే అది తన పరిధిలోని అంశం కాదని ఆయన చెప్పడంతో, పాక్ యాజమాన్యం నేరుగా ఐసీసీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా స్పందించాడు. ఆ నిర్ణయం గురించి తనకేమీ తెలియదని, అంపైర్లు పొరపాట్లు చేయొచ్చు. కానీ నాకు కనిపించినంత వరకు కీపర్ బంతిని పట్టుకోవడానికి ముందే అది నేలకు తాకిందని అతను అభిప్రాయపడ్డాడు.

Next Story