పాక్ పేస‌ర్‌పై సస్పెన్షన్ వేటు

Pakistan pacer Mohammad Hasnain suspended for illegal bowling action.పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ మహ్మద్ హస్నైన్ పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 1:10 PM IST
పాక్ పేస‌ర్‌పై సస్పెన్షన్ వేటు

పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ మహ్మద్ హస్నైన్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన‌ట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేక‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయ‌కుండా అత‌డిపై తాత్కాలిక నిషేదం విధించిన‌ట్లు ఓ ప్ర‌క‌న‌ట‌లో తెలిపింది.

గత నెలలో అతను బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆస్ట్రేలియాలోని అంపైర్లు మొదటిసారిగా హస్నైన్ బౌలింగ్ యాక్ష‌న్‌పై సందేహాలు లేవ‌నెత్తారు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో పోటీ చేయడానికి ఫాస్ట్ బౌలర్ సమయానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉన్నందున అతని బౌలింగ్ యాక్షన్ ను లాహోర్‌లో పరీక్షించారు. గుడ్ లెంగ్త్ డెలివరీ, ఫుల్-లెంగ్త్ డెలివరీ, స్లో బౌన్సర్ మరియు బౌన్సర్ కోసం అతని మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువ‌గా వంచ‌తున్న‌ట్లు తెలిసింది. క్రికెట్ ఆస్ట్రేలియా యొక్క స్వతంత్ర నిపుణుడు నివేదికను సమీక్షించారు. అతను హస్నైన్ బౌలింగ్ యాక్షన్ కూడా చట్టవిరుద్ధమని కనుగొన్నట్లు చెప్పింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బౌలింగ్ నిపుణులతో అత‌డి రిపోర్టు గురించి చ‌ర్చించి, అత‌డి స‌మ‌స్య‌ను పరిష్కరిస్తుంది. అత‌డి కోసం ప్ర‌త్యేకంగా బౌలింగ్ కన్సల్టెంట్‌ను నియ‌మిస్తాం అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒక‌రు తెలిపారు. 21 ఏళ్ల హస్నైన్ పాకిస్థాన్ తరఫున ఎనిమిది వన్డేలు, 18 ట్వంటీ-20ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న పీఎస్ఎల్‌లో అత‌డు క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్నాడు. మూడు మ్యాచుల్లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే.. త‌రువాతి మ్యాచుల్లో అత‌డు ఆడేందుకు పీసీబీ అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఈ స‌మ‌యాన్ని త‌న బౌలింగ్ యాక్ష‌న్‌ను మెరుగుప‌ర‌చుకునేందుకు ఉప‌యోగించుకోవాల‌ని పీసీబీ అత‌డికి సూచించింది.

Next Story