వైరల్.. క్యాచ్ మిస్ చేశాడని కొట్టాడు.. రనౌట్ చేయగానే
Pakistan pacer Haris Rauf slaps teammate Kamran Ghulam for dropping a catch.క్రికెట్ అంటే జెంటిల్‌మన్ గేమ్ అని అంటారు
By తోట వంశీ కుమార్ Published on 22 Feb 2022 6:32 PM ISTక్రికెట్ అంటే జెంటిల్‌మన్ గేమ్ అని అంటారు. ఇక్కడ ఓడినా.. గెలిచినా ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తుంటారు. అయితే.. కొందరు ఆటగాళ్లు చేసే పనులు జెంటిల్‌మన్ గేమ్‌కు మచ్చను తెచ్చిపెట్టేవిధంగా ఉన్నాయి. క్రికెట్‌లో క్యాచ్‌లు మిస్ కావడం సహజం. అయితే.. ఓ ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడని బౌలర్ మైదానంలోనే కెమెరాల సాక్షిగా అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో చోటు చేసుకుంది. ఈ మొత్తం దృశ్యాలు లైవ్‌లో టెలీకాస్ట్ కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. పీఎస్ఎల్‌లో సోమవారం లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడ్డాయి. లాహోర్ ఖలందర్స్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేశాడు. ఆ ఓవర్‌లో రెండో బంతిని పెషావర్ జల్మీ బ్యాట్స్‌మెన్ హజ్రాతుల్లా జజాయ్ భారీ షాట్‌కు యత్నించగా బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద పీల్డింగ్ చేస్తున్న కమ్రాన్ గులామ్ వైపు వెళ్లింది. అయితే.. కమ్రాన్ గులామ్ బంతిని అందుకోవడంలో విఫలం అయ్యాడు. ఫలితంగా క్యాచ్ చేజారింది. ఇక అదే ఓవర్ ఐదో బంతికి పెషావర్ జల్మీ బ్యాట్స్‌మెన్ మహమ్మద్ హ్యారీస్(5) షాట్‌కి యత్నించి ఫవాద్‌కి చిక్కాడు. వికెట్ తీసిన హ్యారిస్ రవూఫ్ ను అభినందించడానికి ఆటగాళ్లు అందరూ అతడి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తన బౌలింగ్ లో క్యాచ్ మిస్ చేసిన కమ్రాన్ గులామ్‌పై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ హ్యారిస్ రవూఫ్.. కమ్రాన్ చెంపపై కొట్టాడు.
ఇక అదే ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో నాలుగో బంతిని పెషావర్ బ్యాట్స్‌మెన్ తలత్ షాట్ ఆడాడు. బంతి మరోసారి కమ్రాన్ గులామ్ వైపు వెళ్లింది. ఈ సారి కమ్రాన్ అద్భుతంగా ఫీల్డింగ్ తో బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేశాడు. పక్కనే ఉన్న హ్యారిస్ రవూఫ్ వెంటనే కమ్రాన్ వద్దకు వచ్చి అతడిని కౌగిలించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సహచర ఆటగాడి పట్ల హ్యారిస్ రవూఫ్ ప్రవర్తించిన తీరు పట్ల నెటీజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 158 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో పెషావర్ జట్టు గెలిచింది.
Wreck-it-Rauf gets Haris! #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/wwczV5GliZ
— PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022