వరుసగా రెండో విజయం.. సెమీస్ దిశగా పాక్
Pakistan Beat New Zealand by 5 wickets.టీ20 ప్రపంచకప్‌కు ముందు పెద్దగా అంచనాలు లేని పాకిస్థాన్ జట్టు చక్కటి
By తోట వంశీ కుమార్ Published on 27 Oct 2021 11:24 AM ISTటీ20 ప్రపంచకప్‌కు ముందు పెద్దగా అంచనాలు లేని పాకిస్థాన్ జట్టు చక్కటి ప్రదర్శనతో దూసుకెలుతోంది. వరుసగా రెండు మేటి జట్లపై విజయాలను సాధించింది. టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లు చిన్న జట్లతోనే(అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్) ఆడాల్సి ఉండడంతో పాక్ సెమీస్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆదివారం భారత జట్టును ఓడించిన పాకిస్థాన్ అదే ఊపులో మంగళవారం న్యూజిలాండ్‌కు షాక్ఇచ్చింది. 5 వికెట్ల తేడాతో బాబర్ అజామ్ సేన విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచిన బాబర్ అజాయ్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కివీస్ ఓపెనర్లు గుప్టిల్ (17), మిచెల్ (27) తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం ఇచ్చారు. అయితే.. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. విలియయ్‌సన్(27), కాన్వే(27) మినహా మిగిలిన వారు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, హఫీజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
టీమ్ఇండియాపై వికెట్ నష్టపోకుండా 152 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించిన పాక్.. 135 పరుగులు చేదించడానికి అష్టకష్టాలు పడింది. కివీస్ బౌలర్లు విజృంభించడంతో కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11), హఫీజ్ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు యత్నించగా.. సోధి అతన్ని పెవిలియన్ చేర్చాడు. దీంతో పాక్ ఓ దశలో 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆసిఫ్ అలీ (12 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. ఆసిఫ్ అలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో మరో ఎనిమిది బంతులు ఉండగానే పాక్ విజయాన్ని అందుకుంది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి 2, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.