పాక్‌పై టీమిండియా ఘోర పరాజయం
మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో పాటు బౌలర్ల అసమర్థ ప్రదర్శన కారణంగా ఆదివారం పాకిస్తాన్ ఎపై భారత్ ఎ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
By - Medi Samrat |
మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో పాటు బౌలర్ల అసమర్థ ప్రదర్శన కారణంగా ఆదివారం పాకిస్తాన్ ఎపై భారత్ ఎ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వైభవ్ సూర్యవంశీ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. అయితే మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో మొత్తం జట్టు 136 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్-ఎ 13.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ తరఫున మాజ్ సదాకత్ అద్భుత అర్ధ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత జట్టులో వైభవ్ ఫిఫ్టీ చేయలేకపోయాడు. 28 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో భారత్ ఎకి ఇది తొలి ఓటమి. తొలి మ్యాచ్‌లో యూఏఈని ఓడించింది.
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ భారత్‌ను బ్యాటింగ్ చేయమని కోరాడు. తొలి బంతికే ఫోర్ కొట్టి వైభవ్ తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ప్రియాంష్ ఆర్య విఫలమయ్యాడు. అతను తొమ్మిది బంతుల్లో 10 పరుగులు చేసి స్కోరు 30 వద్ద ఔటయ్యాడు. అతని తర్వాత వచ్చిన నమన్ ధీర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 20 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 35 పరుగులు చేసి నమన్ ఔటయ్యాడు. 79 పరుగుల వద్ద అతని వికెట్ పడిపోయింది. మరో ఎండ్‌లో వైభవ్ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. అయితే.. ఆ సమయంలోనే సుఫియాన్ ముఖీమ్ వేసిన బంతిని బౌండరీ తరలించే ప్రయత్నంలో మహ్మద్ ఫైక్ అద్భుత క్యాచ్ పట్టి వైభవ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక్కడి నుంచే భారత్ ఇన్నింగ్స్ తడబడింది. చివర్లో హర్ష్ దూబే 15 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులు చేసి జట్టును 136 పరుగులకు చేర్చాడు.