ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించిన కివీస్.. ఒక్క పరుగు తేడాతో విజయం
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 3:15 PM ISTటెస్టు క్రికెట్‌లో బజ్‌బాల్ ఆటతో వరుస విజయాలు సాధిస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తించడమైన బల్ బాల్ విధానం. ఇది అన్ని వేళలా సరికాదని చాలా మంది చెబుతూ వస్తున్నప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని చేదించాలని బావించి చివరికి ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. దీంతో రెండు టెస్టు సిరీస్ 1-1తో సమమైంది.
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 435 పరుగులు చేసింది. అనంతరం కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కేన్ విలియన్ సన్ (132) భారీ శతకంతో చెలరేగగా టామ్ బ్లండెట్(90), టామ్ లేథమ్(83), కాన్వే(61), డారిల్ మిచెల్(54) అర్థశతకాలతో రాణించడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
దీంతో ఇంగ్లాండ్ ముందు 258 పరుగుల లక్ష్యం నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు ఆట తీరు చూస్తున్న వారికి ఇదేమీ పెద్ద లక్ష్యం కాదని అనిపించింది. అయితే.. కివీస్ బౌలర్లు చాలా గొప్పగా బౌలింగ్ చేయడంతో ఐదో రోజు ఓవర్ నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 48 పరుగులతో ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ చివరికి 256 పరుగులే చేయగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 95 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినా అతడికి సహకరించే వారే కరువు అయ్యారు.
కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, టిమ్ సౌథీ మూడు, మ్యాట్ హెన్నీ రెండు వికెట్లు తీశాడు.
టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ తేడాతో గెలుపొందిన జట్టుగా కివీస్ నిలిచింది. ఇంతకముందు 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 30 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కివీస్ ఇలాగేనే విజయం సాధించింది.