మహిళల వన్డే ప్రపంచకప్ 2022.. టీమ్ఇండియాకు తప్పని పరాజయం
New Zealand beat India by 62 runs in ICC Women’s World Cup 2022.మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత్‌కు తొలి ఓటమి
By తోట వంశీ కుమార్ Published on 10 March 2022 9:29 AM GMTమహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్..రెండో మ్యాచులో అతిథ్య న్యూజిలాండ్ చేతిలో 62 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. సెడాన్ పార్కు వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. శుభారంభం దక్కకపోయినా.. అమీలియా కెర్(50), శాటర్త్ వైట్(75), మార్టిన్(41)లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు, రాజేశ్వర్ గైక్వాడ్ రెండు, దీప్తి శర్మ, ఝులన్ గోస్వామి ఓ వికెట్ పడగొట్టారు.
261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 198 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(6), దీప్తి శర్మ(5), మిథాలీరాజ్(31), యాస్తిక భాటియా(28) విఫలం అయినా.. హర్మన్ ప్రీత్ కౌర్ (71) ఒంటరి పోరాటం చేసింది. అయినప్పటికీ ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో లీ తహుహు, అమెలీయా కీర్ చెరో మూడు, జెన్‌సన్ రెండు, జెస్ కెర్ర్, రోవే ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ఝులన్ గోస్వామి రికార్డు
భారత బౌలర్ ఝులన్ గోస్వామి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెటు(39) తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన లిన్ పుల్‌స్టోన్ తో కలిసి అగ్రస్తానంలో కొనసాగుతోంది. ఈ ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఆడాల్సిన మ్యాచ్‌లు ఉండడంతో ఇందులో ఒక్క వికెట్ తీసినా.. ఝులన్ టాప్‌లోకి దూసుకెళ్లనుంది.