బౌల‌ర్లు విఫ‌లం.. కివీస్ 129/0

New Zealand 129/0 at stumps trail by another 216 runs.కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2021 2:46 AM GMT
బౌల‌ర్లు విఫ‌లం.. కివీస్ 129/0

కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా ప‌ట్టు సాధించే అవ‌కాశాన్ని కోల్పోయింది. ఓవ‌ర్‌నైట్ స్కోరు 258/4 తో రెండో రోజు ఆట ఆరంభించిన‌ భార‌త్‌ను టిమ్‌సౌథి(5/69) దెబ్బ తీశాడు. అత‌డి ధాటికి భార‌త్ 345 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అరంగ్రేట ఆట‌గాడు శ్రేయాస్ అయ్య‌ర్ (171 బంతుల్లో 105, 13ఫోర్లు, 2 సిక్స్‌లు) శ‌త‌కంతో స‌త్తా చాటాడు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 129 ప‌రుగులు చేసింది. మూడో రోజు భార‌త బౌల‌ర్లు పుంజుకోక‌పోతే మ్యాచ్‌పై కివీస్ ప‌ట్టు సాధించే అవ‌కాశం ఉంది.

ప్రత్యర్థిని తమ స్పిన్ ఉచ్చులో బంధించేద్దామ‌ని భావించిన టీమ్ఇండియాకు చుక్కెదురైంది. కివీస్‌ ఓపెనర్లు విల్‌ యంగ్‌(180 బంతుల్లో 75 నాటౌట్‌, 12 ఫోర్లు), లాథమ్‌(165 బంతుల్లో 50 నాటౌట్‌, 4 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీల‌తో రాణించారు. వీరిద్దరు భారత బౌలింగ్‌ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు. ముఖ్యంగా కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న యంగ్‌ చక్కని పరిణతి కనబరిచాడు. భార‌త బౌల‌ర్లు ఎంత ఒత్తిడి తెచ్చిన‌ప్ప‌టికీ వికెట్ ఇవ్వ‌కూడ‌దు అన్న ఉద్దేశ్యంతో బ్యాటింగ్ చేసిన యంగ్ లేథ‌మ్ అజేయంగా పెవిలియ‌న్ చేరారు.

అశ్విన్ బౌలింగ్ ఒక క్యాచ్ ఇవ్వ‌డం త‌ప్ప లేథ‌మ్ ఇన్నింగ్స్‌లో లోప‌మే లేదు. అంపైర్లు మూడు సార్లు అత‌డిని ఔట్‌గా ఇచ్చినా.. రివ్యూ(స‌మీక్ష‌)ను ఉప‌యోగించుకుని బ‌య‌ట‌ప‌డ్డాడు. బంతి మ‌రీ నెమ్మ‌దిగా, త‌క్కువ ఎత్తులో రావ‌డంతో కివీస్ ఓపెన‌ర్లు బంతిని ఎదుర్కొన‌డానికి ఎక్కువ స‌మ‌యం దొరికింది. దీని వ‌ల్ల ప‌రుగులు మంద‌కొడిగా వ‌చ్చినా.. వికెట్ కాపాడుకోవ‌డానికి అవ‌కాశం లభించింది. చేతిలో పది వికెట్లు ఉన్న న్యూజిలాండ్‌ ఇంకా 216 పరుగుల వెనుకంజలో ఉంది.

Next Story
Share it