పారిస్ ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతం గెలిచారు. ఫైనల్లో బల్లెం 89.45 మీటర్ల దూరం విరసిరి రెండో స్థానంలో నిలిచారు. పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ 92.97 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచి స్వర్ణం గెల్చుకున్నాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ కాంస్యం సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి రజతం కాగా మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది.
కాగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో భారతీయుడిగా నీరజ్ నిలిచారు. సుశీల్ కుమార్ (2008,2012), పీవీ సింధు (2016,2020), మనూ భాకర్ (2024) అతని కంటే ముందున్నారు. మనూ ఈ ఒలింపిక్స్‌లోనే రెండు మెడల్స్ గెల్చుకున్న విషయం తెలిసిందే. నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకోగా.. ఈసారి రజతం అందుకున్నాడు. నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశారని ఎక్స్ వేదిక పోస్టు పెట్టారు. మరో ఒలింపిక్ పతకంతో సత్తా చాటడంతో భారత్ పొంగిపోయిందన్నారు.
నీరజ్ చోప్రా సిల్వర్ గెలిచిన తమకు బంగారంతో సమానమని ఆయన తల్లి సరోజ్ దేవీ అన్నారు. నీరజ్‌కు గాయం అయ్యిందని, అయినప్పటికీ అతని ప్రదర్శనతో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఇంటికి వచ్చాక ఇష్టమైన ఫుడ్ చేసి పెడతానన్నారు. సిల్వర్ గెలిచాక నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అభినందనలు తెలిపారు. 2016 నుంచి అతనితో పోటీ పడుతున్నానని, కానీ తొలిసారిగా ఓడిపోయానన్నారు. అర్షద్ నిజంగా చాలా కష్టపడ్డాడని, ఇవాళ నాకన్నా ఉత్తమ ప్రదర్శన చేశాడని పేర్కొన్నాడు.