బర్మింగ్‌హోంలో ఈ నెల 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రీడలు ప్రారంభానికి రెండు రోజుల ముందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రాజీవ్ మెహతా ధ్రువీకరించారు. నీరజ్ చోప్రా వందశాతం ఫిట్‌గా లేడని అందుకనే కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022లో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు నీరజ్ చోప్రా. గత ఆదివారం జరిగిన తుది పోరులో నాలుగో ప్రయత్నంలో బల్లెం విసిరే సమయంలో అతడి తొడ కండరాలు పట్టేశాయి. మ్యాచ్ అనంతరం నీరజ్ మాట్లాడుతూ.. నాలుగో ప్రయత్నంలో నా తొడలో అసౌకర్యంగా అనిపించింది. నొప్పి కారణంగా నేను మరింత ప్రయత్నించలేకపోయాను. పరీక్షల తరువాతనే గాయం తీవ్రత గురించి తెలుస్తుందని చెప్పాడు. అతడిని పరీక్షించిన వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే అతడు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం లేదని అసోసియేషన్‌కు సమాచారం అందించాడు.