అగ్రరాజ్యం అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో ఇద్దరు భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్‌కు చేరుకున్నారు. ఇలా ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్ చేరడం అథ్లెటిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ జావెలిన్ ఈవెంట్‌లో 83.50 మీటర్లు ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ కావడంతో నీరజ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి నీరజ్ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీమీటర్ల దూరంలో నిలిచాడు. ఇక భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరగనున్న ఫైనల్ లో నీరజ్ ఎంత దూరం విసరుతాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది.
మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించాడు. రోహిత్ తన జావెలిన్‌ను 80.42 మీటర్ల దూరం విసిరాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో పదవ స్థానంలో నిలిచిన రోహిత్ యాదవ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.