ఎట్టకేలకు జట్టులోకి కుల్దీప్ యాదవ్
ND vs BAN 3rd ODI Kuldeep Yadav added to India's squad.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2022 9:12 AM GMTమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న టీమ్ఇండియా కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని సగటు భారత అభిమాని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శనివారం జరిగే మూడో వన్డేలోనైనా భారత్ విజయం సాధిస్తుందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఇక భారత్ ఓడిన రెండు వన్డేల్లో సరైన స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మూడో వన్డేకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు ఇచ్చింది.
రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. అతడు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం భారత ఓటమిని తప్పించేందుకు నొప్పిని భరిస్తూనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక రోహిత్ ముంబైకి వచ్చాడు. టెస్టు సిరీస్‌లో అతడు ఆడేది లేనిది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
ఇంకోవైపు యువ పేసర్ కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో రెండో వన్డేకు దూరం అయ్యాడు. దీపక్ చాహర్ ని ఫిట్‌నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. రోహిత్‌తో పాటు వీరిద్దరు కూడా మూడో వన్డేకు అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది.
రోహిత్, కుల్దీప్ సేన్, దీపక్ చాహర్‌కు స్వదేశానికి వచ్చినట్లు తెలిపింది. రోహిత్ ముంబై ఆస్పత్రిలో ఓ స్పెషలిస్ట్‌ను సంప్రదించగా కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు చెప్పింది. ఈ ఇద్దరూ కోలుకున్న తర్వాత వారి భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
గాయాలతో ఉన్న వారి పేర్లు లేకుండా మూడో వన్డేకు 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఎట్టకేలకు అవకాశం దక్కించుకుంటున్న కుల్దీప్ యాదవ్ అదరగొట్టి టీమ్ఇండియాకు విజయాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
బంగ్లాతో మూడో వన్డేకు భారత జట్టు :
కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), షాబాద్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్