బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ తలకు తీవ్ర గాయమైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో అతడు కొమిల్లా విక్టోరియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కొమిల్లా విక్టోరియన్స్ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో సిల్హట్ స్ట్రైకర్స్‌తో తలపడనుండగా.. ఆ మ్యాచ్ కోసం చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయపడ్డాడు. పక్కనే ఉన్న నెట్‌లో బ్యాటింగ్ చేస్తున్న లిట్టన్ దాస్ కొట్టిన షాట్‌కు ముస్తాఫిజుర్ రెహమాన్ కు రక్తస్రావం అయింది. స్టాండ్-బై అంబులెన్స్‌లో తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తదుపరి CT స్కాన్‌లలో ముస్తాఫిజుర్‌కు ఎలాంటి అంతర్గత రక్తస్రావం జరగలేదని నిర్ధారించారు. "ప్రాక్టీస్ సమయంలో బంతి నేరుగా ముస్తాఫిజుర్ రెహమాన్ ఎడమ ప్యారిటల్ ఏరియా (తల)కి తగిలింది. అతని ప్యారిటల్ ప్రాంతంలో ఓపెన్ గాయం ఉంది. మేము రక్తస్రావం ఆపడానికి కంప్రెషన్ బ్యాండేజ్ వేశాము.. వెంటనే అతన్ని ఇంపీరియల్ ఆసుపత్రికి తరలించాము" అని బంగ్లాదేశ్ జట్టు మేనేజ్మెంట్ నుండి ప్రకటన వచ్చింది.