సెంచరీతో 29 ఏళ్ల నాటి సచిన్ రికార్డును బద్దలు కొట్టిన సర్ఫరాజ్ తమ్ముడు
2024 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు.
By Medi Samrat Published on 12 March 2024 9:24 AM GMT2024 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. విదర్భతో జరిగిన మూడో రోజు ఆటలో సెంచరీ చేయడం ద్వారా గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 29 ఏళ్ల రికార్డును ముషీర్ ఖాన్ బద్దలు కొట్టాడు. తద్వారా అన్నయ్య సర్ఫరాజ్ ఖాన్ అడుగుజాడల్లో తమ్ముడు ముషీర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీ ఫైనల్లో తుఫాను సెంచరీ సాధించి యావత్ ప్రపంచానికి తన సత్తా చాటాడు.
రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబై విదర్భ జట్టుతో తలపడుతోంది. ఇందులో మంగళవారం ముంబై జట్టు యువ బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ తుఫాను సెంచరీని సాధించి చరిత్ర సృష్టించాడు. 255 బంతులు ఎదుర్కొన్న ముషీర్ సెంచరీ చేసి గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ సాధించగా.. టెండూల్కర్ 21 ఏళ్ల 10 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. ఆ సమయంలో సచిన్ 1994-94 రంజీ సీజన్‌లో పంజాబ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు.
విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్‌లో ముంబై జట్టు టైటిల్‌ను గెలుచుకోవడానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 119 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించగా.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముషీర్ ఖాన్, కెప్టెన్ అజింక్యా జట్టు ఇన్నింగ్స్‌కు బాధ్యత వహించారు. 73 పరుగుల వద్ద కెప్టెన్ రహానే ఔటయ్యాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ 111 బంతులు ఎదుర్కొని 95 పరుగులు చేసి ఔటయ్యాడు. ముషీర్ ఖాన్ 136 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ముంబై 476 పరుగుల ఆధిక్యంలో ఉంది.