మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఫైనల్‌లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్ నేరుగా ఫైనల్‌కు వెళ్లగా.. ఎలిమినేటర్ మ్యాచులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన ముంబై జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. యూపీ వారియర్స్ జట్టును 72 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది హర్మన్ సేన.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. స్కీవర్ బ్రంట్ (72 నాటౌట్; 38 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టగా, అమెలియా కెర్ (29) హీలీ మాథ్యూస్ (26), యస్తిక భాటియా (21), హర్మన్‌ప్రీత్ కౌర్ (14)లు రాణించారు. యూపీ బౌలర్లలో సోఫియా ఎకెల్‌స్టోన్ రెండు వికెట్లు తీసింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 17.4 ఓవర్లలో 110 పరుగులకు కుప్పకూలింది. కిరణ్ నవగిరె (43; 27 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా మిగిలిన వారు విఫలం కావడంతో లక్ష్యానికి చాలా దూరంలోనే వారియర్స్ నిలిచిపోయింది. ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్ ‘హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు తీసింది. సైకా ఇషాఖ్ రెండు పడగొట్టింది. స్కీవర్ బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇక.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై జట్లు కప్పు కోసం తలపడనున్నాయి.