ఆర్‌సీబీ ఇంతేనా.. మ‌హిళ‌ల ఐపీఎల్‌లోనూ నిరాశ త‌ప్ప‌దా..?

డ‌బ్ల్యూపీఎల్ లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీ ఓడిపోయింది. దీంతో ఆ జ‌ట్టుపై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2023 3:15 PM IST
WPL 2023, RCB

ఆర్‌సీబీ ప్లేయ‌ర్స్‌

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) ఆరంభం( 2008) నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం ఎన్నో అంచ‌నాల మ‌ధ్య బ‌రిలోకి దిగ‌డం, ఉసూరుమ‌నిపించ‌డం అల‌వాటుగా మారింది. జ‌ట్టు నిండా స్టార్ ఆట‌గాళ్లు ఉన్నా ఒక్క సారి కూడా ట్రోఫిని ముద్దాడ‌లేదు.

మ‌హిళ‌ల ఐపీఎల్‌(డ‌బ్ల్యూపీఎల్‌)లో టీమ్ఇండియా స్టార్ స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆడుతుండ‌డంతో ఇక్క‌డ అయినా ఆర్‌సీబీ ఫేట్ మారుతుంద‌ని అభిమానులు ఆశించారు. అయితే.. ఇక్క‌డ కూడా అభిమానుల ఆశ‌లు నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు.

వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ ఓడిపోయింది. ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ప‌రాభ‌వం చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 18.4 ఓవ‌ర్ల‌లో 155 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స్మృతి మందన (23), రిచా ఘోష్‌ (28), కనిక అహూజ (22), శ్రెయాంక పాటిల్‌ (23), మేగన్‌ షుట్‌ (20) లకు మెరుగైన ఆరంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో విప‌లం అయ్యారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్‌ 3, సైకా ఇషాఖ్‌, అమేలియా కెర్‌ తలా రెండు వికెట్లు తీశారు.

అనంత‌రం ముంబై 14.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ హీలీ మాథ్యూస్‌ (77 నాటౌట్‌; 38 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్కీవర్‌ బ్రంట్‌ (55 నాటౌట్‌; 29 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) దంచికొట్టారు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించిన‌ హీలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

వ‌రుస‌గా రెండు మ్యాచులు ఓడ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆర్‌సీబీపై సెటైర్లు పేలుతున్నాయి. ఆర్‌సీబీ రాత మార‌ద‌ని, కోహ్లీ వార‌స‌త్వాన్ని స్మృతి కొన‌సాగిస్తుందంటూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. అయితే.. రెండు మ్యాచుల‌తోనే అప్పుడే ఓ అంచ‌నాకు రావ‌ద్దు అని ఆర్‌సీబీ అభిమానులు ఆ జ‌ట్టుకు మ‌ద్ద‌తు ప‌లుకున్నారు. లీగ్‌లో త‌దుప‌రి మ్యాచుల్లోనైనా ఆర్‌సీబీ ప్ర‌ద్శ‌న మారుతుందో లేదో చూడాలి.

Next Story