మొద‌టి బంతికి సిక్స్ కొట్ట‌డానికి ముందు ధోనీతో జ‌రిగిన సంభాష‌ణ గురించి చెప్పిన రిజ్వీ

ఐపీఎల్ 2024లో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

By Medi Samrat  Published on  27 March 2024 1:15 PM GMT
మొద‌టి బంతికి సిక్స్ కొట్ట‌డానికి ముందు ధోనీతో జ‌రిగిన సంభాష‌ణ గురించి చెప్పిన రిజ్వీ

ఐపీఎల్ 2024లో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇదే అతని ఐపీఎల్‌ తొలి మ్యాచ్. ఐపీఎల్ 2024 వేలంలో రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది.

రిజ్వీ తన అరంగేట్రం మ్యాచ్‌లోని మొదటి బంతికి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బలమైన సిక్సర్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వీ 6 బంతుల్లో 14 పరుగులు(2 సిక్స్‌లు) చేశాడు. మ్యాచ్ అనంతరం రిజ్వీ ఐపీఎల్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ధోనీతో తాను జరిపిన సంభాషణను వెల్లడించాడు. 19వ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి ముందు ధోని తనతో ఏమి చెప్పాడో అతను వెల్ల‌డించాడు.

సమీర్ రిజ్వీ మాట్లాడుతూ.. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి ముందు ధోని తనతో.. నా సహజమైన ఆటను ఆడాలని.. ఎటువంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేయమని చెప్పిన‌ట్లు పేర్కొన్నాడు. ధోనీ భాయ్ నాకు ఒక విషయం చెప్పాడు.. నీవు ఇప్పటివరకు ఆడుతున్నదే నీ ఆట. నీవు అలాగే ఆడాలి. భిన్నంగా ఏమీ అవ‌స‌రం లేదు. నీవు ఒత్తిడికి గురికావద్దు. పరిస్థితులకు అనుగుణంగా ఆడు. నీవు ఒత్తిడికి గురికాకుండా ఉంటావు. ఇది నీ మొదటి గేమ్.. కాబట్టి కొంచెం భయాందోళనలకు గురవుతావు. కానీ నీ స‌హ‌జ‌మైన ఆట‌తీరులానే ఆడు అని చెప్పిన‌ట్లు రిజ్వీ సంభాష‌ణ గురించి చెప్పాడు.

ఐపిఎల్ వేలం సందర్భంగా సీఎస్‌కే నన్ను ఎంపిక చేసినప్పుడు, ఎంఎస్ ధోనీని కలవాలనేది మొదటి నుంచి నా కల.. కాబట్టి చాలా సంతోషంగా ఉందని సమీర్ రిజ్వీ చెప్పాడు. ఆయ‌న‌తో ఆడడం మర్చిపోండి.. ఆయ‌న్ని కలవాలనేది నా కల. ఇప్పుడు నా కల నెరవేరింది.. నేను వారితో ఆడుతున్నాను. మేమిద్దరం కలిసి నెట్స్‌లో చాలా బ్యాటింగ్ చేసాము. నేను ఆయ‌న‌ నుండి చాలా నేర్చుకున్నాను. కోచింగ్‌ స్టాఫ్‌ నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. కాబట్టి ఈ టీమ్‌ నుంచి వీలైనంత వరకు నేర్చుకోవడమే నా లక్ష్యం అని పేర్కొన్నాడు.

Next Story