బ్రేకింగ్‌.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న ధోని.. షాక్‌లో చెన్నై అభిమానులు

MS Dhoni steps down as CSK captain hands over reigns to Ravindra Jadeja.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2022 9:34 AM GMT
బ్రేకింగ్‌.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న ధోని.. షాక్‌లో చెన్నై అభిమానులు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుండ‌గా.. చెన్నై అభిమానుల‌కు మ‌హేంద్ర‌సింగ్ ధోని షాకిచ్చాడు. ఆ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అత‌డి వార‌సుడిగా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను ఎంపిక చేశారు. ఈ సీజ‌న్ నుంచే చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు ర‌వీంద్ర జ‌డేజా సార‌ధిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్న‌ట్లు చెన్నై జ‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఐపీఎల్ ప్రారంభ‌మైన 2008 సంవ‌త్స‌రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై జ‌ట్టుకు ధోని సార‌ధిగా వ్య‌వ‌హించాడు. మ‌ధ్య‌లో రెండేళ్ల పాటు చెన్నై జ‌ట్టు నిషేదానికి గురైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 12 సీజ‌న్ల‌లో చెన్నైకి సార‌థిగా వ్య‌వ‌హ‌రించిన మ‌హేందుడు 4 సార్లు చెన్నైను ఐపీఎల్ విజేత‌గా నిల‌బెట్టాడు. అత‌డి సార‌థ్యంలో చెన్నై 11 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేర‌గా.. 9 సార్లు ఫైన‌ల్ ఆడింది. ఐపీఎల్ 2020 సీజ‌న్ మిన‌హా మిగ‌తా అన్ని సీజ‌న్ల‌లో చెన్నై జ‌ట్టు అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌నను క‌న‌బ‌రిచింది.

చెన్నై జ‌ట్టు ధోని సార‌ధ్యంలో 204 మ్యాచులు ఆడ‌గా.. 121 విజ‌యాలు సాధించింది. 82 మ్యాచుల్లో ఓడగా, ఓ మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఐపీఎల్‌లో మ‌హేంద్రుడి విజ‌యాల శాతం 52.60గా ఉంది. మొత్తంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మ‌హేంద్రుడు.. రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ కూడా గెలిచాడు.

మెగా వేలానికి ముందు చెన్నై జ‌ట్టు మొదటి రిటెన్షన్‌గా రవీంద్ర జడేజాని రూ.16 కోట్లకు, రెండో రిటెన్షన్‌గా ఎమ్మెస్ ధోనీని రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. మ‌హేంద్రుడు ఐపీఎల్‌లో ఆడ‌ని ఆరు మ్యాచుల్లో చెన్నైకి సురేష్ రైనా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. దీంతో చెన్నైకి మూడో కెప్టెన్‌గా ర‌వీంద్ర జ‌డేజా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ఆల్‌రౌండ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జ‌డేజా.. కెప్టెన్‌గా ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.

Next Story