బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్ని వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. ఇటీవలే తన తండ్రిని కోల్పోయిన అతడు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు. సిరాజ్ కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సిరాజ్‌కు అండగా ఉంటామని పలువురు ట్విట్లు చేస్తున్నారు.
తొలి టెస్టులో మహ్మద్ షమి గాయపడడంతో.. రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడో టెస్టులోనూ అతడికి అవకాశం దక్కింది. జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో భావోద్వేగం చెందాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. రెండు చేతులతో ఆ కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. ఇదంతా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు సిరాజ్. ప్రమాదకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను పెవిలియన్ చేర్చాడు. నాలుగో ఓవర్‌లో ఓ చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా ఊరించే బంతి వేయడంతో వార్నర్ స్లిప్‌లో పుజారా చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.