పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం అయ్యాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో షమికీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో అతడు మంగళవారం(సెప్టెంబర్ 20) నుంచి ఆసీస్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో మరో పేసర్ ఉమేశ్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు. "అవును.. షమీకి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అయితే.. లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ అతను ఒంటరిగా ఉండవలసి ఉంటుంది. అతడికి నెగెటివ్ వచ్చినప్పుడు తిరిగి జట్టుతో చేరుతాడు. ఇది దురదృష్టకరం అని అన్నాడు.
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ 20 వరల్డ్ కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో షమీకి చోటు దక్కలేదు. అతడినికి స్టాండ్ బై ఎంపిక చేశారు.
ఇదిలా ఉంటే.. మొహాలీ వేదికగా భారత్, ఆసీస్ జట్ల మధ్య మంగళవారం తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, హర్షల్ పటేల్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లు శనివారం సాయంత్రం చండీగఢ్ చేరుకున్నారు.