'అర్జున అవార్డు'కు షమీ పేరు సిఫారసు

భారత వన్డే ప్రపంచకప్ హీరోల్లో ఒకరైన పేసర్ మహమ్మద్ షమీని ఈ ఏడాది అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది.

By Medi Samrat  Published on  13 Dec 2023 9:15 PM IST
అర్జున అవార్డుకు షమీ పేరు సిఫారసు

భారత వన్డే ప్రపంచకప్ హీరోల్లో ఒకరైన పేసర్ మహమ్మద్ షమీని ఈ ఏడాది అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది. 33 ఏళ్ల షమీ ODI ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ప్రపంచకప్‌లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, కేవలం ఏడుమ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టాడు. మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం, దేశంలోని రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం జాబితాలో షమీ పేరు మొదట లేకపోయినా.. ఇప్పుడు అతని పేరును చేర్చాలని BCCI క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రత్యేక అభ్యర్థన చేసింది.

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డులతో సహా ఈ సంవత్సరం క్రీడా అవార్డులను అందించడానికి మంత్రిత్వ శాఖ 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో ఆయన మాత్రమే కాకుండా ఆరుగురు మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు కూడా ఉన్నారు. హాకీ ప్లేయర్ ధనరాజ్ పిళ్లే, మాజీ పాడ్లర్ కమలేష్ మెహతా, మాజీ బాక్సర్ అఖిల్ కుమార్, మహిళా షూటర్ మరియు ప్రస్తుత జాతీయ కోచ్ షుమా షిరూర్, మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా, బ్యాడ్మింటన్ ప్లేయర్ త్రిప్తి ముర్గుండే, పవర్‌లిఫ్టర్ ఫర్మాన్ పాషా కూడా ప్యానెల్‌లో ఉన్నారు.

Next Story