మిథాలీ 'ది గ్రేట్'.. సరికొత్త రికార్డు
Mithali Raj Becomes Leading Run Scorer Across Formats In Women's International Cricket.మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్
By తోట వంశీ కుమార్ Published on 4 July 2021 4:15 PM ISTమహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ సుదీర్ఘ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘమైన కెరీర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ చరిత్ర సృష్టిస్తూ వెళుతోంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్టీ ఎడ్ వర్డ్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. మహిళల ఇంటర్నేషనల్ పోటీల్లో ఎడ్ వర్డ్స్ 10,273 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మిథాలీ ఆ రికార్డును దాటేసింది. మహిళా క్రికెట్‌లో ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన క్రికెటర్‌గా మిథాలీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ మిథాలీ రాజ్ మొత్తం 10,342 పరుగులు చేయగా ఇందులో 669 పరుగులు టెస్టుల్లో, 7304 పరుగులు వన్డేల్లో, 2364 పరుగులు వన్డేల్లో చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగులు (7304) చేసిన రికార్డు కూడా మిథాలీ పేరిటే ఉంది. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు గా పురుషుల్లో సచిన్ టెండుల్కర్ (34357), మహిళల్లో మిథాలీ రాజ్ (10273) నిలిచారు. మిథాలీ తర్వాతి స్థానాల్లో చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) - 10273, సూజీ బేట్స్ (న్యూజీలాండ్) - 7849, స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్) - 7832 మెగ్ లాన్నింగ్ (ఆస్ట్రేలియా) - 7024 ఉన్నారు.
🙌 🙌#TeamIndia 🇮🇳 pic.twitter.com/VRUMcDofGe
— BCCI (@BCCI) July 4, 2021
ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుతమైన విజయం అందుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా మిథాలీ మ్యాచ్ ను ముగించింది. వర్షం కారణంగా కొంతమేరకు అవాంతరాలు ఏర్పడిన మ్యాచ్ ని 47 ఓవర్లకు కుదించగా, ఇంగ్లండ్ విధించిన 220 పరుగుల టార్గెట్ ను భారత్ ఛేదించింది. 75 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ను గెలిపించిన మిథాలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మూడు వన్డేల సిరీస్ లో ఆఖరి మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచింది. మ్యాచ్ మధ్యలో అవుట్ కాకూడదని, ఈ గేమ్ లో గెలిచి తీరాలని, చివరి వరకూ పోరాడాలని తాను భావించానని మ్యాచ్ అనంతరం మిథాలీ వెల్లడించింది. 2022 న్యూజీలాండ్ వన్డే వరల్డ్ కప్ తర్వాత మిథాలీ రాజ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నది. మిథాలీ ఇన్నింగ్స్ పై పలువురు ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించారు.