విరాట్ కోహ్లీ.. నిన్ను చూసేందుకు స్కూల్ ఎగ్గొట్టి వచ్చాను
Missed school to see you Virat Kohli fan's banner goes viral.టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్
By తోట వంశీ కుమార్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండున్నర సంవత్సరాలుగా సెంచరీ చేయకున్నా.. ఈ పరుగుల యంత్రానికి ఫాలోయింగ్ తగ్గడం లేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు విరాట్ కోహ్లీని చూసేందుకు స్టేడియాలకు వస్తుంటారు. వీలైతే ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఎగబడుతుంటారు.
ప్రస్తుతం విరాట్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. కరోనా కారణంగా గతేడాది రద్దు అయిన ఐదో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లాండ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో గురువారం నుంచి భారత జట్టు లీసెస్టర్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే.. అందరిలో ఓ బుడతడు మాత్రం ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ఆరాధ్య క్రికెటర్ కోహ్లీని చూసేందుకు స్టేడియానికి వచ్చాడు ఆ విద్యార్థి.
'విరాట్ సర్.. మీరు అత్యుత్తమ క్రికెటర్.. నేను మిమ్మల్ని చూసేందుకు స్కూల్ ఎగ్గొట్టి మరీ వచ్చాను' అంటూ ఓ ఫ్లకార్డును పట్టుకుని నిలబడ్డాడు. విరాట్ అంటే అతడికి ఎంత ఇష్టమో ఆ ఫ్లకార్డు తెలియజేస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడు ఫ్లకార్డు పట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
Same feelings bud 🫶#KingKohli is currently in action in #TeamIndia's warm-up game v/s Leicestershire XI 😍#ENGvIND #SirfSonyPeDikhega @BCCI pic.twitter.com/b6EhMTpbKg
— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2022
గత కొంత కాలంలో ఫామ్‌లో లేక సతమతమవుతున్న విరాట్ కోహ్లీ.. ఈ వార్మప్ మ్యాచ్‌లో సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. 69 బంతుల్లో4 పోర్లు, 1 సిక్స్ బాది 33 పరుగులు మాత్రమే చేశాడు. రెండు గంటలకు పైగా క్రీజులో ఉన్న విరాట్.. కేఎస్ భరత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 246 /8తో నిలిచింది.