కొంపముంచిన రనౌట్లు.. ఐదో మ్యాచ్‌లోనూ ముంబైకి నిరాశే
MI 5th consecutive loss in IPL 2022.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కి ఇండియన్ ప్రీమియర్
By తోట వంశీ కుమార్ Published on 14 April 2022 3:57 AM GMTఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. టోర్నీలో ఆ జట్టు ఓటముల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబై జట్టుకు గెలుపు అందని ద్రాక్షగానే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై లీగ్ స్టేజ్‌ను దాటాలంటే.. అద్భుతంగా ఆడడంతో పాటు మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిస్తే తప్ప సాధ్యం కాదు. బుధవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 198/5 భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్(52; 32 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో రాణించగా.. చివర్లో జితేశ్‌శర్మ( 30 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. ముంబై బౌలర్లలో థంపి రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, ఉనాద్కత్, మురుగన్ అశ్విన్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ (28;17 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడడంతో ముంబై 3.3 ఓవరల్లోనే 31/0 నిలిచింది. అయితే.. రబాడ.. రోహిత్ జోరును కొనసాగనివ్వలేదు. ఇషాన్ కిషన్(3) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ తరువాతి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. దీంతో ముంబై 31/2 తో నిలిచింది. ఈ దశలో యువ ఆటగాళ్లు బ్రెవిస్(49; 25 బంతుల్లో 4పోర్లు, 5 సిక్స్‌లు), తిలక్ వర్మ (36; 20 బంతుల్లో 3పోర్లు, 2 సిక్స్‌లు) లు ఎలాంటి బెదురులేకుండా ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా బ్రెవిస్.. స్పిన్నర్ రాహుల్ చాహర్‌కు చుక్కలు చూపించాడు. అతడు వేసిన తొమ్మిదో ఓవర్‌లో రెండో బంతి నుంచి వరుసగా 4,6,6,6,6 బాదడంతో ఆ ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి.
ఈ ఇద్దరూ పోటాపోటిగా బౌండరీలు బాదడంతో ముంబై వేగంగా లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో వీరిద్దరు మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. స్మిత్ బౌలింగ్‌లో బ్రెవిస్ ఔట్ కాగా.. లేని పరుగు కోసం యత్నించి తిలక్ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అయితే.. సూర్యకుమార్ యాదవ్(43; 30 బంతుల్లో 1పోర్, 4 సిక్స్‌లు), పొలార్డ్ (10; 11 బంతుల్లో 1పోర్) ఉండడంతో ముంబై గెలుపు మీద ఆశలు వదులుకోలేదు. అయితే.. పొలార్డ్ కూడా సమన్వయ లోపంతో రనౌట్ కావడంతో ముంబై అవకాశాలు సన్నగిల్లాయి. ఓ వైపు సూర్య ధాటిగా ఆడుతున్నప్పటికీ మరో వైపులో అతడికి సహకరించే వారు కరువయ్యారు. దీంతో సూర్యపై ఒత్తిడి పెరిగిపోయింది. భారీ షాట్ ఆడబోయి ఒడియన్ స్మిత్‌కు సూర్య చిక్కడంతో ముంబై ఆశలకు తెరపడింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లకు 186 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రబాడ రెండు, ఆరోరా ఓ వికెట్ పడగొట్టాడు.