అండర్-19 T20 ప్రపంచకప్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి గొంగడి త్రిష
Meet 17YO Gongadi Trisha from Hyd who helped India lift U-19 T20 World Cup trophy.ప్లాస్టిక్ బ్యాట్, బాల్‌తో ఆడడం నుంచి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Jan 2023 2:49 AM GMTరెండున్నరేళ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాట్, బాల్‌తో ఆడడం నుంచి అండర్-19 టీ20 క్రికెట్ ప్రపంచకప్ గెలిచే వరకు 17 ఏళ్ల గొంగడి త్రిష తన కెరీర్ లో చాలా ఎదిగింది. ఫైనల్ లో హైదరాబాద్ యువ క్రికెటర్ త్రిష 24 పరుగులు చేసి సౌమ్య తివారీతో కలిసి 46 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికాలో ఆదివారం జరిగిన చివరి ఐసిసి మహిళల అండర్ -19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అండర్ -19 మహిళల జట్టుపై భారత జట్టు 69 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.
త్రిష కెరీర్ ఎలా మొదలైందంటే:
త్రిష క్రికెట్ కథ ఆమె రెండవ పుట్టినరోజప్పుడు మొదలైంది. ఆమె తండ్రి ఆమెకు ప్లాస్టిక్ బాల్, బ్యాట్ ఇవ్వడంతో క్రికెట్ అంటే ప్రేమ మొదలైంది. తన వయసులో ఉన్న ఇతర పిల్లల్లాగే, ఆమె బ్యాట్, బంతితో ఆడటానికి ఉత్సాహంగా కనిపించింది, కానీ ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఆమె తండ్రి జి.వి. రామిరెడ్డి మాజీ U-16 జాతీయ హాకీ క్రీడాకారుడు, ఆమె ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఆమెను జిమ్‌కి తీసుకెళ్లి, ఆమెకు 300 కంటే ఎక్కువ త్రోడౌన్‌లు బౌల్ చేసేవారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, 2005లో త్రిష జన్మించినప్పుడు, రామిరెడ్డి తన భార్య మాధవికి తన కూతురు కార్టూన్ లు చూడదని.. అందుకు బదులుగా టీవీలో క్రికెట్ చూపిద్దామని చెప్పేవారు.
“అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, నా బిడ్డను అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్‌ని చేయాలని నిర్ణయించుకున్నాను. నా కూతురు టీవీలో కార్టూన్లు కాకుండా క్రికెట్ మ్యాచ్‌లు చూడాలని.. నేను పట్టణంలోని స్థానిక మైదానంలో సిమెంట్ పిచ్‌ని ఏర్పాటు చేసాను. ఆమెకు శిక్షణ ఇవ్వడానికి సమయాన్ని వెచ్చించాను. నా కూతురు ప్రాక్టీస్‌లో బాగా ఆడితే నేను ఆమెకు డ్రాయింగ్ పుస్తకాలు, క్రేయాన్‌లను కొనిచ్చేవాడిని” అని రామి రెడ్డి అన్నారు.
ఒక తండ్రి త్యాగం :
ఆంధ్రప్రదేశ్‌లోని భద్రాద్రి కొత్తగూడెం నివాసి రామి రెడ్డి తన జిమ్‌ను మూసివేసి, ఐటీసీలో ఫిట్‌నెస్ ట్రైనర్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. తన కుమార్తె కోసం క్రికెట్ కోచ్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. కూతురి శిక్షణ కోసం పదేళ్ల క్రితం స్వగ్రామం విడిచిపెట్టి తనకున్న నాలుగెకరాల పొలాన్ని కూడా అమ్మేశాడు.
“ఆమె కలల కోసం నేను మా ఊరు వదిలి సికింద్రాబాద్ వచ్చిన రోజున, ఆమె నన్ను గర్వపడేలా చేస్తుందని నాకు తెలుసు. పిచ్‌పై త్రిష బాగా ఆడడం చూసినప్పుడు గతంలో కోల్పోయినవేవీ గుర్తుకురాలేదు" అని రామి రెడ్డి చెప్పారు. 2012లో రామి రెడ్డి త్రిష నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను రూపొందించి, దానిని హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ అకాడమీలో కోచ్‌లు జాన్ మనోజ్, శ్రీనివాస్‌లకు చూపించారు. 7 సంవత్సరాల వయస్సులో, త్రిష ఓపెనర్ బ్యాటర్ గా రాణిస్తూ ఉండగా కోచ్‌లు ఆమెను ఆల్‌రౌండర్‌గా మార్చేందుకు స్పిన్ బౌలింగ్ లో శిక్షణ ఇచ్చారు.
కెరీర్ గణాంకాలు:
రెండు సంవత్సరాలలో బాగా రాణించింది త్రిష. త్రిష 2014-2015 సీజన్‌లో ఇంటర్-స్టేట్ టోర్నీలో హైదరాబాద్ U-16 జట్టు తరపున ఆడింది, ఆపై U-19, U-23 జట్లలోకి కూడా ప్రవేశించింది. ఆ తర్వాత అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో అవకాశం దక్కించుకుంది.
ఇండియా U-19: 6 మ్యాచ్‌లు, 130 పరుగులు, 3 వికెట్లు
లిస్ట్ A: 20 మ్యాచ్‌లు, 370 పరుగులు, అత్యధిక స్కోరు: 69, 17 వికెట్లు, 17 పరుగులకు 5 వికెట్లు
T20లు: 21 మ్యాచ్‌లు, 335 పరుగులు, అత్యధిక స్కోరు: 56*, 16 వికెట్లు, 10పరుగులకు 3 వికెట్లు
త్రిష అద్భుతమైన స్పిన్నర్:
సెయింట్ జాన్స్ అకాడమీకి చెందిన జాన్ మనోజ్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ “పదేళ్ల క్రితం, త్రిష బ్యాటింగ్ చేస్తున్న వీడియోతో ఆమె తండ్రి మా వద్దకు వచ్చారు. ఆమె బ్యాటింగ్ వేగం, చేతికి-కంటికి మధ్య సమన్వయం మమ్మల్ని ఆకట్టుకుంది. అలాంటి వేగంతోనూ సమన్వయంతోనూ 7 సంవత్సరాల వయస్సులో ఒక అమ్మాయి ఆడటం నిజంగా అద్భుతమే.
త్రిషకు కోచ్‌లలో ఒకరైన శ్రీనివాస్ కు కూడా ఆమెలో ఒక స్పార్క్ కనిపించింది. తర్వాత భారత మాజీ కోచ్ ఆర్.శ్రీధర్ తన అకాడమీలో ఆమెకు శిక్షణ ఇచ్చాడు. భారత మాజీ స్పిన్నర్ నూషిన్ అల్ ఖదీర్, ప్రపంచ కప్‌లో భారత U-19 కోచ్, ఆమె స్పిన్ బౌలింగ్‌ను మెరుగుపరిచింది. త్రిష అనిల్ కుంబ్లేలా బౌలింగ్ చేసే ఫ్రీకిష్ లెగ్ స్పిన్నర్ అని కోచ్ మనోజ్ చెప్పారు.
“త్రిష ఎప్పుడూ అబ్బాయిలతో ఆడుతూ ఉండేది. ఆమె బలమైన హిట్టర్, బ్యాటింగ్ ఆల్ రౌండర్. మాజీ భారత క్రికెటర్ మిథాలీ రాజ్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. త్రిషకు ఆమె ముందు బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం కలిగింది”అని మనోజ్ చెప్పారు. త్రిష ఈ సంవత్సరం జరిగే మొదటి మహిళల ఐపీఎల్ లో భాగమవుతుందని ఆశిస్తున్నారు. రెండేళ్లలో త్రిష భారత జాతీయ జట్టుకు ఆడుతుందని కోచ్‌లు భావిస్తున్నారు.