అటు అజాజ్.. ఇటు మయాంక్.. 300కి చేరువలో భారత్
Mayank and Axar take India to 285/6 at Day 2 Lunch.ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2021 6:34 AM GMTముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట లంచ్ విరామానికి భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (146; 306 బంతుల్లో 16 పోర్లు, 4 సిక్సర్లు)తో పాటు స్పిన్నర్ అక్షర్ పటేల్ (32; 98 బంతుల్లో 4 పోర్లు) ఉన్నాడు. వీరిద్దరు అబేధ్యమైన ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోర్ 221/4 తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే అజాజ్ పటేల్ భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఒకే ఓవర్‌లో ఓవర్ నైట్ బ్యాట్స్‌మెన్ సాహా(27)తో పాటు రవిచంద్రన్ అశ్విన్(0) ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 224 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా.. ఈ ఆరు వికెట్లను అజాజ్ పటేల్ తీయడం విశేషం.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు మయాంక్ చూడ చక్కని షాట్లతో అలరించాడు. అతడికి అక్షర్ పటేల్ నుంచి చక్కని సహకారం లభించింది. ఇద్దరూ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. ప్రస్తుతం మయాంక్ 150 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 350 పరుగులు చేస్తే .. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో భారత్ మ్యాచ్‌పై పట్టుసాధించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.