యూఏఈలోనే టి20 ప్రపంచకప్‌..!

May shift T20 World Cup to UAE.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2021 9:50 AM IST
యూఏఈలోనే టి20 ప్రపంచకప్‌..!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్ మ‌ధ్య‌లోనే వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఐపీఎల్ వాయిదా ప‌డ‌డంతో ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. అయితే.. భార‌త్‌లో క‌రోనా కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికి అక్టోబ‌రు నాటికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్ప‌లేక‌పోతున్నారు. పైగా క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు జారీ అవుతున్నాయి. ఈసందిగ్థ‌త కొన‌సాగుతుండ‌గానే ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై ఏదో ఒక‌టి తేల్చాలంటూ అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు( బీసీసీఐ)కి విధించిన గ‌డువు ఈ నెలాఖ‌రు ముగుస్తుంది.

దీంతో భార‌త్‌లో ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించే అవ‌కాశం లేద‌ని.. యూఏఈకి మార్చే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం భార‌త్‌లో ఉన్న క‌రోనా ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తున్నామ‌ని.. టోర్నీలో పాల్గొనే ప్లేయ‌ర్ల ఆరోగ్యం, ర‌క్ష‌ణ కీల‌క‌మైంద‌న్నారు. టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వ‌హించాలా లేదా అన్న అంశంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని షా వెల్ల‌డించారు. వేదిక మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని షా చెప్పారు.

ఇక యూఏఈలోనే సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 మధ్య ఐపీఎల్‌ 2021లో మిగిలిన మ్యాచ్‌ల‌ను నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్​ యూఏఈ వేదికగా అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. అంటే ఐపీఎల్ ముగిసిన రెండు రోజుల‌కే టీ20 ప్ర‌పంచ క‌ప్ ప్రారంభం కానుంది. పొట్టి కప్ ఫైనల్ నవంబర్ 14న జరగనుందట. దాదాపు 28 రోజుల పాటు టీ20 ప్రపంచకప్ అభిమానులను అలరించనుంది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలోని మ్యాచులు అబుదాబి, షార్జా, దుబాయ్​ వేదికగా జరగనున్నాయి. ఒమన్ రాజధాని మస్కట్‌ను కూడా నాలుగో వేదికగా పరిగణలోకి తీసుకున్నారట. కాగా.. త్వ‌ర‌లోనే టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది ఐసీసీ.

Next Story