SRH vs RR : పరుగుల వరద గ్యారంటీ.. సొంతగడ్డపై విజయంపై కన్నేసిన హైదరాబాద్
ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 1:33 PM ISTవిజయంపై కన్నేసిన హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 16వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు(ఆదివారం) తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. కెప్టెన్‌గా ఎంపికైన దక్షణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో ఈ మ్యాచ్‌కు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సారధిగా వ్యవహరిస్తున్నాడు.
ఇంగ్లాండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ప్రదర్శనపై హైదరాబాద్ భారీగా ఆశలు పెట్టుకుంది. మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్ లు బ్యాటింగ్‌లో కీలకంకానున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, జాన్‌సెన్, నటరాజన్‌లతో కూడిన పేస్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌తో పాటు వాషింగ్టన్ సుందర్‌పైనే ఆధారపడి ఉంది.
ఇంకోవైపు రాజస్థాన్ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్‌మైర్, జాసన్ హోల్డర్, శాంసన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఆ జట్టు సొంతం వీరిలో ఏ ఇద్దరు నిలిచినా హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో బౌల్డ్, అశ్విన్, చహల్, జంపా, మెకాయ్, సందీప్ శర్మలతో ముప్పు పొంచి ఉంది.
పిచ్ విషయానికి వస్తే.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్డేడియంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకు సహకారం అందిస్తుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరే 183 కావడం గమనార్హం. ఇక మ్యాచ్‌కు వరుణుడి ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. పొడిగా ఉంటుందని, మబ్బులు కనిపించినా వర్షం మాత్రం పడే అవకాశాలు లేవని తెలిపింది.
ఇక ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 16 సార్లు తలపడగా చెరో 8 సార్లు విజయం సాధించాయి.