రెండోదీ పాయే.. ఎస్ఆర్‌హెచ్‌పై లక్నో విజయం
Lucknow chowk Hyderabad to win by 12 runs.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టలేదు.
By తోట వంశీ కుమార్ Published on 5 April 2022 4:31 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టలేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కష్ట సాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్.. ఒత్తిడికి గురై పరాజయం వైపు నిలిచింది. విజయానికి మూడు ఓవర్లలో 33 పరుగులు చేయాల్సిన దశలో లక్నో పేసర్ అవేశ్ ఖాన్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. వరుస బంతుల్లో హార్డ్ హిట్టర్లు పూరన్, అబ్దుల్ సమద్‌ను పెవిలియన్ చేర్చి రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (68; 50 బంతుల్లో 6 పోర్లు, 1 సిక్స్) దీపక్ హుడా(51; 33 బంతుల్లో 3పోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్, షెఫర్డ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది.
ఓపెనర్లు కేన్ విలియమ్సన్ (16), అభిషేక్ శర్మ (13) ఎక్కువసేపు నిలువలేకపోగా.. రాహుల్ త్రిపాఠి (44; 30 బంతుల్లో 5 పోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్(34; 24 బంతుల్లో 3పోర్లు, 2 సిక్సర్లు) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ నాలుగు, జాసెన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన లక్నోపేసర్ అవేశ్ ఖాన్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇక నేడు మంగళవారం రాజస్థాన్‌తో బెంగళూరు తలపడనుంది.