టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నమ్యాచ్‌లో ఆటగాళ్లు కొట్టుకున్నంత పని చేశారు. లంక బౌలర్ లాహిరు కుమారా, బంగ్లా బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్‌ల మధ్య తీవ్ర మాటల యుద్దం నడిచింది. సహచర ఆటగాళ్లతో పాటు అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన లాహిరు కుమార ఐదో బంతికి లిటన్ దాస్‌ను ఔట్ చేశాడు. అనంతరం లిటన్‌దాస్ వైపు లాహిరు చూస్తూ ఏదో అన్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన లిటన్ దాస్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ఇద్దరూ దూషించుకుంటూ ఒకరిపైకి ఒకరు వచ్చారు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని వారించి పక్కకు తీసుకువెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ నయీం(62), ముష్ఫికర్ రహీమ్(57 నాటౌట్) అర్థశతకాలతో రాణించారు. లంక బౌలర్లో చమిక, ఫెర్నాండో, లాహిరు కుమార తలా ఓ వికెట్ తీశారు. మరీ లంక 172 లక్ష్యాన్ని చేదిస్తుందో లేదో చూడాలి మరీ.