లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్‌ సంచలన ప్రకటన

భారత బాక్సింగ్‌ దిగ్గజ క్రీడాకారిణి మేరీ కోమ్‌ సంచలన ప్రకటన చేశారు. ఆమె బాక్సింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. త

By అంజి  Published on  25 Jan 2024 1:19 AM GMT
Mary Kom, retirement,boxing

లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్‌ సంచలన ప్రకటన

భారత బాక్సింగ్‌ దిగ్గజ క్రీడాకారిణి మేరీ కోమ్‌ సంచలన ప్రకటన చేశారు. ఆమె బాక్సింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. తన వయోపరిమితిని ప్రధాన కారణంగా పేర్కొంటూ జనవరి 24న క్రీడల నుంచి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 'నాకు ఇంకా సాధించాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తూ వయో పరిమితి దృష్ట్యా బలవంతంగా నిష్క్రమించాల్సి వస్తోంది. నేను నా జీవితంలో ప్రతిదీ సాధించాను' అని మేరీ ఒక కార్యక్రమంలో చెప్పారు.

41 ఏళ్ల మేరీ కోమ్‌ తన కెరీర్‌లో అనేక మైలురాళ్లను అందుకున్నారు. భారత దిగ్గజ మహిళా బాక్సర్‌గా ఆమె ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. మొత్తం ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో 8 సార్లు పతక విజేతగా నిలిచిన తొలి బాక్సర్‌గా రికార్డ్‌ నెలకొల్పారు. అంతేకాకుండా 2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. ఐదు సార్లు ఏషియన్‌ ఛాంపియన్‌గానూ నిలిచారు. ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ సాధించిన భారత తొలి మహిళా బాక్సర్‌ మేరీనే.

మణిపుర్‌కు చెందిన మేరీ కోమ్‌ నిరుపేద కుటుంబం నుండి వచ్చారు. స్కూల్‌ నుంచే బాక్సింగ్‌ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి, భర్త ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 41 ఏళ్ల మేరీకి ముగ్గురు పిల్లలు. క్రీడారంగంలో ఆమె సేవలను గుర్తించిన కేంద్రం 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమించింది. కాగా ఆమె బయోపిక్‌లో స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా లీడ్‌ రోల్‌లో నటించారు.

మేరీ కోమ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడంపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె ప్రకటనతో బాక్సింగ్‌లో ఒక శకం ముగిసిందని పోస్టులు చేస్తున్నారు. తన ఆట తీరుతో భారత ఖ్యాతిని మరింత పెంచారని.. ఆమె సహకారాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని కామెంట్లు చేస్తున్నారు. బాక్సింగ్‌ ప్రపంచానికే నిజమైన ఐకాన్‌ అని, హ్యాపీ రిటైర్మెంట్‌ మేరీ అని చెబుతున్నారు.

Next Story