ఆటకు మలింగ గుడ్‌బై
Lasith Malinga announces retirement from all forms of cricket.దశాబ్దానికిపైగా పదునైన యార్కర్లతో ప్రత్యర్థి
By తోట వంశీ కుమార్ Published on 15 Sep 2021 3:07 AM GMTదశాబ్దానికిపైగా పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను వణికించాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ. ఇప్పటికే టెస్టు, వన్డేల నుంచి తప్పుకున్న మలింగ.. తాజాగా టీ20ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు 38 ఏళ్ల మలింగ మంగళవారం ప్రకటించాడు. ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చేసిందన్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని.. ఇంతకాలం పాటు తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. క్రికెట్‌పై ఉన్న ప్రేమ ఎన్నటికి తగ్గదని.. రానున్న రోజుల్లో తన అనుభవాలను యువ ఆటగాళ్లతో పంచుకోనున్నట్లు ట్వీట్ చేశాడు. మలింగ సారధ్యంలోనే శ్రీలంక జట్టు 2014లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2020 మార్చిలో లంక తరుపున తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా ఐదు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన అరుదైన రికార్డు మలింగ పేరిటే ఉంది. శ్రీలంక తరఫున 84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగ 107 వికెట్లు పడగొట్టాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు, 30 టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కేరిర్‌లో 546 వికెట్లు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 122 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు సాధించాడు. 5/13 అత్యుత్తమ ప్రదర్శన. టీ20ల్లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్ మలింగనే.
ఐపీఎల్‌లో 11సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ ప్రాతినిధ్యం వహించాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు మొత్తంగా 5 టైటిళ్లు సాధించగా.. అందులో నాలుగు సార్లు (2013, 2015, 2017, 2019) టైటిల్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఓవరాల్‌గా 295 టి20ల్లో అతను 7.07 ఎకానమీతో 390 వికెట్లు తీశాడు.