మైదానంలో వెక్కివెక్కి ఏడ్చిన కృనాల్ పాండ్య

Krunal Pandya cries during mid innings interview.పుణె వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆల్‌రౌండ‌ర్ కృనాల్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2021 6:32 AM GMT
Krunal Pandya cries during mid innings interview

పుణె వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్య కేవ‌లం 31 బంతుల్లో 7పోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 58 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ(26 బంతుల్లో) చేసిన అరంగేట్ర ఆటగాడిగా కృనాల్ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇన్ని తక్కువ బంతుల్లో ఇప్పటివరకు ఏ అరంగేట్ర ఆటగాడూ అర్థ‌శ‌త‌కం సాధించ‌లేదు. ఇదిలా ఉంటే.. అర్థ‌శ‌త‌కం పూర్తైన త‌రువాత కృనాల్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. గాల్లోకి బ్యాట్ చూపిస్తూ.. త‌న తండ్రికి ఈ అర్థ‌శ‌త‌కం అంకితమిస్తున్న‌ట్లు సైగ చేశాడు. అలాగే ఛాతీపై ఉన్న టీమిండియా సింబల్‌ను చూపిస్తూ గర్జించాడు.

అదే స‌మ‌యంలో ఇటు పెవిలియ‌న్‌లో ఉన్న హార్థిక్ క‌ళ్లు సైతం చెమ‌ర్చాయి. ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత కృనాల్.. హార్థిక్‌ను కౌగిలించుకుని చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇన్నింగ్స్ విరామంలో కృనాల్‌ను మాట్లాడించేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఉబికి వ‌స్తున్న క‌న్నీళ్ల‌ను ఆపుకోలేక‌పోయిన అత‌ను ఈ అర్థ‌శ‌త‌కాన్ని తండ్రికి అంకిత‌మిస్తున్న‌ట్లు గ‌ద్గ‌ద స్వ‌రంతో చెప్పాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ సమయంలో పాండ్యా బ్రదర్స్ తండ్రి హిమాన్షు పాండ్యా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

కాగా.. మ్యాచ్‌కు ముందు కృనాల్ త‌న త‌మ్ముడు హార్థిక్ చేతుల మీదుగా 233వ వ‌న్డే క్యాప్ అందుకున్నాడు. త‌మ్ముడి చేతుల మీదుగా క్యాప్ అందుకున్న కృనాల్ త‌న తండ్రిని త‌లుచుకుని బావోద్వేగానికి గుర‌య్యాడు. అత‌డు క‌న్నీరు పెట్టుకున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేయ‌గా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story