ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి టైటిల్‌ విజేతగా కోనేరు హంపి

తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే వుమెన్స్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నారు.

By Knakam Karthik
Published on : 24 April 2025 4:14 AM

Sports News, Koneru Hampi, FIDE Womens Grand Prix, Chess Tournament, Dronavalli Harika

ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి టైటిల్‌ విజేతగా కోనేరు హంపి

తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే వుమెన్స్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నారు. పుణె వేదికగా జరిగిన ఈ చెస్ టోర్నీలో తుదిపోరు సమయానికి చైనా క్రీడాకారిణి జు జినర్‌తో కలిసి హంపి అగ్రస్థానంలో కొనసాగారు. బుధవారం చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో సలిమోవా (బల్గేరియా)పై గెలిచి ఆమె ఏడు పాయింట్లతో అగ్రస్థానం సాధించారు. పోలినా (రష్యా)ను ఓడించిన జు జినర్‌ (చైనా) కూడా ఏడు పాయింట్లతో నిలిచింది. ఫైనల్ రౌండ్‌లో కోనేరు హంపి బల్గేరియాకు చెందిన సుర్గుయిల్ సలిమావాపై 1-0 తేడాతో గెలుపొందారు. మరోపక్క జు జినర్ కూడా రష్యాకు చెందిన పొలినా షువలోవాపై విజయం సాధించడంతో వీరిద్దరూ మొదటి స్థానంతో ముగించారు. అయితే, ఉత్తమ టై-బ్రేక్ ఆధారంగా హంపి టైటిల్ విజేతగా నిలిచారు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక మంగోలియా క్రీడాకారిణి ముంగంతూర్ బత్ఖుయాగ్‌తో, వైశాలి జార్జియా క్రీడాకారిణి సలోమ్ మెలియాతో, దివ్య దేశ్‌ముఖ్ రష్యాకు చెందిన ఎలీనా కాష్లిన్‌స్కాయాతో తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.

‘‘చాలా కాలం తర్వాత క్లాసికల్‌ చెస్‌లో మంచి ఫలితం సాధించా. రేటింగ్‌ పాయింట్లు కూడా సంపాదించా. ఉత్తమ ప్లేయర్‌ను అదృష్టం వరిస్తుందన్నది నా నమ్మకం’’ అని హంపి వ్యాఖ్యానించింది. 37 ఏళ్ల హంపి గత ఏడాది డిసెంబరులో ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. మహిళల గ్రాండ్‌ ప్రి మొత్తం ఆరు అంచెల్లో జరుగుతుంది. ప్రతి క్రీడాకారిణి గరిష్టంగా మూడు టోర్నీల్లో పోటీపడొచ్చు. సాధించిన స్థానాల ఆధారంగా పాయింట్లు ఇస్తారు. గ్రాండ్‌ ప్రి ముగిసే సరికి అత్యధిక పాయింట్లు సాధించిన తొలి ఇద్దరు అమ్మాయిలకు నేరుగా మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌కు అర్హత లభిస్తుంది.

Next Story