చ‌రిత్ర సృష్టించిన పంజాబ్‌.. టీ20, ఐపీఎల్ హిస్ట‌రీలోనే భారీ ఛేజింగ్..!

ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది.

By Medi Samrat  Published on  27 April 2024 7:18 AM IST
చ‌రిత్ర సృష్టించిన పంజాబ్‌.. టీ20, ఐపీఎల్ హిస్ట‌రీలోనే భారీ ఛేజింగ్..!

ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజ‌యంతో టీ20 హిస్ట‌రీలో పంజాబ్ చ‌రిత్ర సృష్టించింది.

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా టీ20 చరిత్రలోనే అతిపెద్ద స్కోరును చేజ్ చేసింది. 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 18.4 ఓవర్లలో ఛేదించింది. అంటే చివరికి ఎనిమిది బంతులు మిగిలాయి. ఐపీఎల్ చరిత్రలో 262 పరుగుల విజయవంతమైన ఛేజింగ్. అంతకుముందు ఐపీఎల్ 2020లో పంజాబ్‌పై రాజస్థాన్ 224 పరుగులను ఛేదించింది. జానీ బెయిర్‌స్టో, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లు పంజాబ్‌కు విజయాన్ని అందించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు ఫిల్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేశారు. అనంత‌రం పంజాబ్ జ‌ట్టులో ఓపెన‌ర్‌ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 54 పరుగులు చేసి పంజాబ్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో 48 బంతుల్లో 108 పరుగులు, శశాంక్ సింగ్ 28 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో 42 సిక్సర్లు కొట్టారు, ఇది ఐపీఎల్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో అత్యధికం.

ఈ విజయంతో పంజాబ్ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఆరు ఓటములతో ఆరు పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. కోల్‌కతా జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు, మూడు ఓటములతో 10 పాయింట్లను కలిగి ఉంది. పంజాబ్ తదుపరి మ్యాచ్‌ని మే 1న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. కోల్‌కతా ఏప్రిల్ 29న ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీతో ఆడాల్సి ఉంది.

Next Story