ఆ ఇద్ద‌రిలో బుమ్రా స్థానాన్ని భ‌ర్తీ చేసేది ఎవ‌రు.?

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది

By Medi Samrat  Published on  21 Feb 2024 3:18 PM IST
ఆ ఇద్ద‌రిలో బుమ్రా స్థానాన్ని భ‌ర్తీ చేసేది ఎవ‌రు.?

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన బుమ్రాకు విశ్రాంతి లభించింది. రాహుల్ ఇంకా ఫిట్‌గా లేడు. బుమ్రా స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తార‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. రాంచీలో భారత్ ఇప్పటి వరకు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. రాంచీలో 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. 2019లో టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించింది.

రాంచీ టెస్టు మ్యాచ్‌కు ముందు బెంగాల్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్‌కి అరంగేట్రం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దేశవాళీ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన‌ ముఖేష్ కుమార్ కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు. బీహార్‌తో ఇటీవల ముగిసిన రంజీ మ్యాచ్‌లో ముఖేష్ ఒక ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఆకాష్‌ దీప్‌ను ప్లే-11లో ఉంచుతాడా లేక అనుభవజ్ఞుడైన ముఖేష్‌కు అవకాశం ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

నాల్గవ టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్ భాగస్వామిగా ఇరువురిలో ఎవ‌రిని భాగ‌స్వామిగా ఎంపిక చేయ‌నున్నార‌నేది ఉత్కంఠ‌గా మీరింది. ఇండియా ఎ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఆకాష్ బౌలింగ్ చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. భారత్ ఎ తరఫున ఆకాష్ రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఆకాష్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23.58 సగటుతో 104 వికెట్లు తీశాడు.

మరోవైపు ప్లేయింగ్-11లో రజత్ పాటిదార్ ఉండ‌క‌పోవ‌చ్చు. విశాఖపట్నం టెస్టులో రజత్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత రాజ్‌కోట్‌లో మరోసారి అవకాశం ఇచ్చారు. అక్క‌డ‌ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఖాతా తెరవలేకపోయాడు.

రజత్ స్థానంలో కర్ణాటక ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్‌కు అవకాశం లభించవచ్చు. పడిక్కల్ 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 44.54 సగటుతో 2,227 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు సాధించాడు. పడిక్కల్ తన చివరి 11 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు సాధించాడు. కర్ణాటక తరఫున మూడు సెంచరీలు, భారత్-ఎ తరఫున రెండు సెంచరీలు చేశాడు. అతని అద్భుతమైన ఫామ్‌ను చూసి.. రాంచీ టెస్టులో రజత్ పాటిదార్ స్థానంలో రోహిత్ శర్మ అతనికి అవకాశం ఇస్తాడ‌ని అంతా భావిస్తున్నారు.

Next Story