కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. ముంబైకి తప్పని ఓటమి
Knight Riders beat Mumbai by 52 runs keep playoff hopes alive.ఐదు సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కు
By తోట వంశీ కుమార్ Published on 10 May 2022 3:59 AM GMT
ఐదు సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో అస్సలు కలిసి రావడం లేదు. పేస్ గుర్రం బుమ్రా సంచలన బౌలింగ్‌తో కోల్‌కతా భారీ స్కోర్ సాధించకుండా అడ్డుకున్నా.. ఓ మోస్తారు లక్ష్యాన్ని చేదించలేక 52 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది ముంబై. 12 మ్యాచుల్లో ఐదో విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (43; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ రాణా (43; 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో ఓ దశలో కోల్‌కతా 200 చేసేలా కనిపించింది. అయితే.. శ్రేయస్ అయ్యర్ (6), రస్సెల్ (9), షెల్డన్ జాక్సన్ (5), కమిన్స్ (0) విఫలం కావడంతో ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. చాన్నాళ్ల తర్వాత బుమ్రా సంచలన బౌలింగ్‌తో సత్తా చాటారు. నాలుగు ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఓ మోస్తారు లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (51; 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2). రమన్‌దీప్ సింగ్ (12), టిమ్ డేవిడ్ (13), పొలార్డ్ (15), సామ్స్ (1) విఫలం అయ్యారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ 3, రస్సెల్ 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది.