మూడో టెస్టు ముందు భారత్‌కు భారీ షాక్
KL Rahul Ruled Out Of Ongoing Test Series.టీమ్ఇండియాకు షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు.
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2021 1:00 PM IST
బాక్సింగ్ డే టెస్టు గెలిచి మంచి ఊపుమీదున్న టీమ్ఇండియాకు షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. శనివారం మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్ గాయపడ్డాడు. అతడి ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. గాయాన్ని పరిశీలించిన వైద్యులు అతడికి మూడు వారాల విశ్రాంతి అవసరం అని సూచించారు. దీంతో అతడు చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడంలేడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. వెంటనే అతడు స్వదేశానికి రానున్నట్లు సమాచారం.
UPDATE: KL Rahul ruled out of Border-Gavaskar Trophy.
— BCCI (@BCCI) January 5, 2021
More details 👉 https://t.co/G5KLPDLnrv pic.twitter.com/S5z5G3QC2L
'మెల్‌బోర్న్ మైదానంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేఎల్ రాహుల్ ఎడమచేతి మణికట్టు బెణికింది. గాయం కారణంగా రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలోని చివరి రెండు టెస్టులకు దూరం అవుతున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి అతడికి మూడు వారాల సమయం పడుతుంది. అతడిప్పుడు భారత్‌కు వెళ్లనున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చేరుతాడు' అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో(వన్డేలు, టీ20లు)లో రాహుల్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి అతడికి తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా విఫలం అవుతుండడంతో.. మూడో టెస్టుల్లో రాహుల్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో అతడు గాయపడడం నిజంగా టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై.. బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాల కారణంగా స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా.. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్టు మ్యాచ్ మొదలుకానుంది.