ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది పాటు నిషేదం..?
KL Rahul and Rashid Khan might be banned from IPL for a year.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 కోసం
By తోట వంశీ కుమార్ Published on 1 Dec 2021 1:18 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 కోసం ఎనిమిది ప్రాంచైజీల రిటైనింగ్ ప్రక్రియ ముగిసింది. ఎనిమిది జట్లు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు.. వేలం కోసం వదిలివేసిన ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. కాగా.. పంజాబ్ కింగ్స్ కే ఎల్ రాహుల్‌ను, సన్ రైజర్స్ హైదరాబాద్ రషీద్ ఖాన్ ను వేలం కోసం విడిచిపెట్టాయి. వీరిద్దరిని ఆయా జట్లు విడిచిపెట్టినందుకు ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే నిజం అయితే.. వీరిద్దరిపై ఏడాది నిషేదం పడనుంది. ఇప్పటికే వీరిద్దరిపై పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే వీరిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు.
ఏం జరిగిందంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జట్టు అయినటువంటి లక్నో ప్రాంచైజీతో రాహుల్, రషీద్ లు సంప్రదింపులు జరిపారని.. భారీ మొత్తం ఆ జట్టు ఇస్తానని చెప్పడంతో వీరిద్దరు తమ పాత జట్లను వదిలివేశారట. దీనిపై పంజాబ్, హైదరాబాద్ బీసీసీఐకి ఫిర్యాదు చేశాయట. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ప్రాంచైజీలో కాంట్రాక్టు ప్రకారం కొనసాగుతున్న ఆటగాళ్లు మరో ప్రాంచైజీని సంప్రదించకూడదు. గతంలో ఇదే కారణంతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు పడింది. ఒకవేళ.. కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు లక్నో ఫ్రాంచైజీతో సంప్రదింపులు జరిపిన విషయం నిజమని తేలితే వీళ్లిద్దరిపైనా ఏడాది పాటు వేటు పడే అవకాశాలు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్‌కు రూ.20కోట్లు, రషీద్‌కు రూ.16కోట్లు ఇచ్చేందుకు లక్నో జట్టు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.