IPL-2024: కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్‌టైమ్ రికార్డు

టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి ఒక్క అడుగుదూరంలోనే ఉంది కేకేఆర్ టీమ్‌.

By Srikanth Gundamalla  Published on  22 May 2024 11:49 AM IST
kkr, captain shreyas iyer, record, ipl-2024, cricket,

 IPL-2024: కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్‌టైమ్ రికార్డు

ఐపీఎల్-2024 సీజన్ చివరి దశకు వచ్చేసింది. మొదట్నుంచి టేబుల్‌ టాపర్‌గా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఎట్టకేలకు ఫైనల్స్‌కు వెళ్లింది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా తొలి ఫైనలిస్ట్‌ అయ్యింది. కాగా.. కేకేఆర్ టీమ్‌ ఐపీఎల్‌ లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు సార్లు ఫైనల్‌కు చేరింది. తాజాగా టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి ఒక్క అడుగుదూరంలోనే ఉంది.

మంగళవారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో.. టాస్‌ గెలిచి హైదరాబాద్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రాహుల్ త్రిపాఠి 55, హెన్రిచ్ క్లాసెన్ 32, పాట్‌ కమిన్స్ 30 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ 3 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. ఇక 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ కేవలం 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 58 (నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ 51 (నాటౌట్) పరుగులు చేశారు. కమిన్‌స, నటరాజన్‌ చెరో వికెట్ల తీశారు.

కాగా.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా శ్రేయస్‌ అయ్యర్‌ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే.. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజీ శ్రేయస్‌ను వదులుకోవడంతో కేకేఆర్‌కు వచ్చాడు. తిరిగి ఇక్కడ కూడా కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. మరోసారి తన టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. లీగ్‌ దశలో విజయాలతో హెరెత్తించిన కేకేఆర్ పాయింట్ల పాట్టికలో అగ్రస్థానంలోనే ఉంది. బౌలర్లు.. ఫీల్డర్లను చక్కగా ఉపయోగించి క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనను ఇచ్చాడు కెప్టెన్ శ్రేయస్. ఇక ఈ టీమ్‌ ఫైనల్‌లో క్వాలిఫయర్-2 విజేతతో చెపాక్‌ స్టేడియంలో ఆదివారం ఆడనుంది.

Next Story