ఇషాన్ కిషన్ తుఫాను సెంచరీ.. చివ‌ర్లో వ‌చ్చి కుమ్మేశాడు..!

బుధవారం విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తుఫాను సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

By -  Medi Samrat
Published on : 24 Dec 2025 2:57 PM IST

ఇషాన్ కిషన్ తుఫాను సెంచరీ.. చివ‌ర్లో వ‌చ్చి కుమ్మేశాడు..!

బుధవారం విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తుఫాను సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. త‌ద్వారా విజయ్ హజారే ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కిషన్ నిలిచాడు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించిన బీహార్‌కు చెందిన సకీబుల్ ఘనీ పేరిట విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచ‌రీ రికార్డు ఉంది.

అయితే బీహార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డును ఇషాన్ కిషన్ బద్దలు కొట్టాడు. బుధ‌వారం అరుణాచల్ ప్రదేశ్‌పై వైభవ్ 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. దానిని కిషన్ బ్రేక్ చేశాడు. మిడిల్ ఆర్డర్‌లోకి వచ్చి సెంచరీ చేసినందుకు ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జార్ఖండ్ తరఫున కిషన్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 27 ఏళ్ల ఇషాన్ కిషన్ కర్ణాటకపై 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 320.15. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులోకి ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో కిషన్ మంచి ఎంపికగా నిరూపించుకోగలడని అభిమానులు నమ్ముతున్నారు.

ఇదిలావుంటే.. జార్ఖండ్- కర్ణాటక మధ్య గ్రూప్ A మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. టాస్ గెలిచిన కర్ణాటక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (125), కుమార్ కుషాగ్రా (63), విరాట్ సింగ్ (88) రాణించడంతో జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది.

Next Story