షాకిచ్చిన పొలార్డ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
Kieron Pollard retires from international cricket.వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం
By తోట వంశీ కుమార్ Published on 21 April 2022 9:37 AM ISTవెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యారు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగుల్లో మాత్రం ఆడతానని స్పష్టం చేశాడు. కాగా.. ప్రస్తుతం పొలార్డ్ వెస్టిండీస్ జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
2007లో అంతర్జాతీయ అరగ్రేటం చేసిన పొలార్డ్.. ఎన్నో మ్యాచుల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 'బాగా ఆలోచించాను. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయం తీసుకున్నా. వెస్టిండీస్ జట్టుకు ఆడాలని 10 ఏళ్ల వయసు నుంచే కల కన్నా. 15 సంవత్సరాలకు పైగా నేను టీ20, వన్డేల్లో వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నా. జట్టుకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నా ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికి ధన్యవాదాలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పొలార్డ్ రాసుకొచ్చాడు.
34 ఏళ్ల పొలార్డ్ విండీస్ తరుపున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2,706 పరుగులు చేయడంతో పాటు 55 వికెట్లు పడగొట్టగా, టీ20ల్లో 1,569 రన్స్ తో పాటు 42 వికెట్లు తీశాడు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను భారత్‌తోనే ఆడాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.