మ్యాచ్ ముగియ‌క ముందే సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ చేసిన‌ కావ్య.. వీడియో వైర‌ల్‌..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గత సీజన్‌లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా..

By Medi Samrat  Published on  25 May 2024 10:55 AM IST
మ్యాచ్ ముగియ‌క ముందే సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ చేసిన‌ కావ్య.. వీడియో వైర‌ల్‌..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గత సీజన్‌లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు అద్భుతంగా పునరాగమనం చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ఈ విజయం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేవు. ఆమెకు సంబంధించిన‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె తన తండ్రి కళానిధి మారన్‌ను పరిగెత్తుకుంటూ.. కౌగిలించుకోవడం చూడ‌వ‌చ్చు.

క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 175 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో రాజస్థాన్ జట్టుకు 42 పరుగులు అవసరం. చివరి ఓవర్లో హైదరాబాద్ స్పష్టమైన విజయాన్ని చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

19వ ఓవర్ ముగిసిన వెంటనే.. కావ్య మారన్ ఆనందంతో గెంతుతూ.. మ్యాచ్ ముగియకుండానే చప్పట్లు కొడుతూ కనిపించింది. ఆ త‌ర్వాత‌ కావ్య తన తండ్రి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుని అభినందించింది. కావ్యకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడోసారి ఫైనల్స్‌కు చేరుకుంది. ముందుగా డేవిడ్ వార్నర్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు 2016లో ఫైనల్‌కు చేరగా.. ఆ సీజన్ ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది, కానీ CSK చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరుకోగా.. కేకేఆర్‌తో తలపడాల్సి ఉంది.

Next Story