కెప్టెన్సీకి రాజీనామా.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ తిరస్కరణ‌.. కేన్ మామ‌ దిగ్భ్రాంతికరమైన నిర్ణయం

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు దారుణంగా విఫ‌ల‌మైంది. ఆ జ‌ట్టు సూపర్-8కి కూడా చేరుకోలేక‌పోయింది. దీంతో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

By Medi Samrat  Published on  19 Jun 2024 4:45 PM IST
కెప్టెన్సీకి రాజీనామా.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ తిరస్కరణ‌.. కేన్ మామ‌ దిగ్భ్రాంతికరమైన నిర్ణయం

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు దారుణంగా విఫ‌ల‌మైంది. ఆ జ‌ట్టు సూపర్-8కి కూడా చేరుకోలేక‌పోయింది. దీంతో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించాడు. కేన్‌ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిస్థితుల్లో అతడు త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవకాశం ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి కేన్‌ తప్పుకున్నాడు. ఆశ్చర్యకరంగా.. విలియమ్సన్‌తో పాటు లాకీ ఫెర్గూసన్ కూడా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుండి సెంట్రల్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి నిరాకరించాడు.

ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. విలియమ్సన్ తన ఆటపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. న్యూజిలాండ్ తరఫున 350కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు విలియమ్సన్. T20 ప్రపంచ కప్ 2024లో నిరాశాజనక ప్రదర్శన కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల చేతిలో ఓడిపోవడంతో కివీ జట్టు గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తన నిర్ణయం ప‌ట్ల‌.. తాను అంతర్జాతీయ క్రికెట్‌పై ఆసక్తి కోల్పోయాన‌ని అర్థం చేసుకోవద్దని విలియమ్సన్ అన్నాడు. తన ఆటపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేన్‌ తెలిపాడు. భవిష్యత్తులో సెంట్ర‌ల్ కాంట్రాక్టులను అంగీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. "అన్ని ఫార్మాట్లలో జట్టు ఎదగడానికి సహాయం చేయడం నాకు చాలా మక్కువ. నేను దానికి సహకరించాలనుకుంటున్నాను" అని అతను చెప్పాడు.

ఈ సమయంలో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్లు విలియమ్సన్ తెలిపాడు. "న్యూజిలాండ్ తరపున ఆడటం ఒక విశేషం. జట్టు కోసం మంచి ప్రదర్శన చేయడం ఎల్లప్పుడూ నా ప్రాధాన్యత. అయితే, క్రికెట్ వెలుపల నా జీవితాన్ని మార్చిన నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం.. స్వదేశంలో, విదేశాలలో వారితో సరదాగా గడపడం అనుభవాలను ఆస్వాదించడం కూడా చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో 100వ టెస్టు ఆడిన విలియమ్సన్ ఇప్పటివరకూ న్యూజిలాండ్ తరఫున 165 వన్డేలు, 93 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు న్యూజిలాండ్‌కు 40 టెస్టులు, 91 ODIలు, 75 T20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు, వీటిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021గెలిచారు. ODI ప్రపంచ కప్ 2019 సూపర్ ఓవర్‌లో ఓడిపోయారు. T20 ప్రపంచ కప్ 2021 ఫైనల్స్‌కు చేరుకోవడంతో సహా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కివీ జట్టు తరఫున ఒక టెస్టు, 65 వన్డేలు, 42 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను అంగీకరించడానికి ఫెర్గూసన్ కూడా నిరాకరించారు. 33 ఏళ్ల లాకీ ఫెర్గూసన్.. పాపువా న్యూ గినియా (పిఎన్‌జి)పై అద్భుత ప్రదర్శన చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫెర్గూసన్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు, ఇది ఒక రికార్డు. T20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా ఫెర్గూసన్ నిలిచాడు.

Next Story