పంత్ కు కష్టాలే అంటున్నారే..!
Just Give A Break To Rishabh Pant. దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టు కెప్టెన్ గా పంత్ ను నియమించారు.
By Medi Samrat Published on 19 Jun 2022 2:45 PM IST
దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టు కెప్టెన్ గా పంత్ ను నియమించారు. అయితే బ్యాటింగ్ లో అతడు విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ లో అంత చురుగ్గా లేడనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పంత్ పై పాకిస్థాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా స్పందించాడు. అధిక బరువు వల్ల వికెట్ల వెనుక పంత్ పెద్దగా వంగి ఉండలేకపోతున్నట్టు చెప్పాడు. ''పంత్ వికెట్ కీపింగ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఒకటి గుర్తించాను. ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేస్తున్న సందర్భాల్లో పంత్ చతికిలపడి పాదాలను వంచి కూర్చోలేకపోతున్నాడు. అతడు అధిక బరువుతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అతడు 100 శాతం ఫిట్ గా ఉన్నాడా? కానీ పంత్ కెప్టెన్సీ విషయానికి వచ్చే సరికి అతడికి పాండ్యా, కార్తీక్ సహా అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను గెలిచిన తొలి కెప్టెన్ గా గుర్తింపు పొందే అవకాశం రిషబ్ పంత్ ముందు ఉంది''అని కనేరియా చెప్పుకొచ్చాడు.
దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ పంత్ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్ ఒకే రకమైన తప్పులు చేస్తున్నాడని.. ఈ సిరీస్‌లో పంత్‌కు నాలుగు అవకాశాలు లభించాయి. ప్రతిసారీ అతను ఒకే తప్పు చేశాడు. మంచి ఆటగాళ్లు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారని మనం అనుకుంటాం. కానీ పంత్ నేర్చుకోవడం లేదని విమర్శించాడు. దినేష్ కార్తీక్ దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడని, తను ఎంతటి క్లాస్ ఆటగాడో నిరూపించుకుంటున్నాడని చెప్పాడు. ఒకవేళ భారత్ కనుక ప్రపంచకప్ గెలవాలని అనుకుంటే.. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను తీసుకోవాలన్నాడు.