టీ20ల్లో రోహిత్ రికార్డ్ బద్దలు కొట్టిన జోస్ బట్లర్
Jos Buttler broke Rohit Sharma’s big record. ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని
By Medi Samrat Published on 24 Jun 2023 3:19 PM IST
ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా జోస్ బట్లర్ మరోమారు వార్తల్లో నిలిచాడు. బట్లర్ టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని సాధించిన మొదటి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా బట్లర్ నిలిచాడు.
ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఆడుతున్న జోస్ బట్లర్.. ఈ మైలురాయిని దాటాడు. బట్లర్ గత మ్యాచ్‌లో 83 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు బట్లర్ టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులను పూర్తి చేశాడు. దీంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 8వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో జోస్ బట్లర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. టీ20లో 10,000 పరుగులు పూర్తి చేసేందుకు రోహిత్ 362 ఇన్నింగ్స్‌లు ఆడాడు. బట్లర్ తన 350వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. టీ20ల్లో బట్లర్ మినహా ఏ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ కూడా 10,000 పరుగులు చేయలేదు. బట్లర్ అద్భుత ఇన్నింగ్స్‌తో లంక్‌షైర్.. డెర్బీషైర్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది.
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. టీ20 క్రికెట్‌లో గేల్ ఇప్పటివరకు 14,562 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 12,528 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ రెండో స్థానంలో ఉన్నాడు. కీరన్ పొలార్డ్ 12,175 పరుగులతో మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ 11,965 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.