ఛేదనలో ఇంగ్లాండ్ దూకుడు.. బౌలర్లు రాణిస్తేనే
Joe Root and Jonny Bairstow Dominate India.భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా
By తోట వంశీ కుమార్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఆట ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 119 పరుగులు అవసరం కాగా.. భారత్ గెలవాలంటే ఏడు వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ (76 బ్యాటింగ్; 9 ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (72 బ్యాటింగ్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నారు.
తొలి మూడు రోజులు అద్భుతంగా పోరాడి విజయం దిశగా అడుగులు వేసిన భారత్ అనూహ్యంగా వెనకబడింది. ఇంగ్లాండ్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిలిపినప్పటికీ గెలుపు కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఇంగ్లీష్ ఓపెనర్లు అలెక్స్ లీస్(56), జాక్ క్రాలీ(46) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించి బలమైన పునాది వేయగా ఆ తరువాత మూడు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టిన భారత్ తిరిగి పోటిలోకి వచ్చింది. అయితే.. రూట్, బెయిర్ స్టో జోడి భారత ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో చూస్తుండగానే ఇంగ్లాండ్ స్కోరు 150, 200, 250 దాటేసింది. ఈ జంట నాలుగో వికెట్‌కు అజేయంగా 151 పరుగులు జోడించింది. ఆఖరి రోజు వీరిద్దరిని ఎంత త్వరగా పెవిలియన్ చేరుస్తారు అన్నదానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 120 పరుగులు జోడించి 245 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బ్యాటర్లలో చతేశ్వర్ పుజారా (66; 8 ఫోర్లు), రిషబ్ పంత్ (57; 8 ఫోర్లు) అర్థశతకాలతో రాణించారు.