భార‌త్‌లో ఆడాల్సిందే.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్‌..!

టీ20 ప్రపంచకప్ 2026 వేదికను మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది.

By -  Medi Samrat
Published on : 7 Jan 2026 9:41 AM IST

భార‌త్‌లో ఆడాల్సిందే.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్‌..!

టీ20 ప్రపంచకప్ 2026 వేదికను మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భద్రతా కారణాలను చూపుతూ తమ‌ మ్యాచ్‌లను భారత్‌ నుండి శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే టోర్నమెంట్ ఆడటానికి బంగ్లాదేశ్ భారత్‌కు రావాల్సి ఉంటుందని ICC స్పష్టంగా చెప్పింది.

ESPNcricinfo నివేదిక ప్రకారం.. మంగళవారం ICC, BCB అధికారుల మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మ్యాచ్‌ల వేదికల‌లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సీనియర్ పురుషుల జట్టు షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌లో పర్యటించాల్సి ఉంటుందని ఐసిసి బిసిబికి సూటిగా తెలిపింది. అలా చేయని పక్షంలో జట్టు పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని వెల్ల‌డించింది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం అంటే 4 జనవరి 2025 నాడు తమ‌ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని అభ్యర్థిస్తూ ఐసిసికి అధికారిక లేఖ రాసింది. దీని వెనుక భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని బీసీబీ పేర్కొంది.

అయితే.. ఐసీసీ భారత్‌లో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి కార‌ణాలు కనిపించకపోవడంతో వేదికను మార్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతానికి, ఈ సమావేశానికి సంబంధించి రెండు బోర్డులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇదిలావుంటే.. BCCI అభ్యర్థనపై IPL జట్టు KKR ఇటీవల బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలపై భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నందున, దేశవ్యాప్తంగా ఉన్న‌ వ్యతిరేకత కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ వేలంల‌ 9 కోట్లకు పైగా రెహమాన్‌ను కొనుగోలు చేసే సమయంలో కూడా వ్యతిరేకత వచ్చింది. రెహమాన్‌ను బీసీసీఐ విడుదల చేయడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంలోకి దిగింది.

Next Story